హోం మంత్రి బంధువనని చెప్పి అక్రమ వసూళ్లు
కాకినాడ: హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేరు చెప్పి విద్యాసంస్థలు, ఎన్జీవోల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. అతని పేరు అవినాష్. తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన అవినాష్ హోం మంత్రి చినరాజప్ప పేరు చెప్పి విద్యాసంస్థలు, ఎన్జీవోల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఫిబ్రవరి 27న పెద్దాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఓ రాజకీయ నేత ఒత్తిడి తేవడంతో వదిలేశారు. ఢిల్లీ కేంద్రంగా మానవ హక్కుల సంఘం తరఫున దక్షిణ భారతదేశానికి ఛైర్మన్ అంటూ హల్‌చల్ చేస్తున్నాడు. సఫారీ కారు, ప్రైవేటు గన్‌మెన్లను పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నాడు. అంతర్జాతీయ మానవహక్కుల సంఘం పేరుతో ఐక్యరాజ్య సమితి బార్ అసోసియేషన్ అనుబంధ సంస్థగాను, సెమి ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటూ మభ్యపెట్టి వసూళ్లు చేశాడు.
అంతే కాదు ఓ దళిత కుటుంబాన్ని కూడా ఇంట్లో బంధించి విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆ దృశ్యాలను వీడియో తీశాడు. తనను ప్రశ్నిస్తే మీకూ ఇదే గతి పడుతుందని పలువురి బాధితులకు ఆ వీడియో పంపి హెచ్చరించాడు. బాధితుల్లో ఒకరు సదరు వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అవినాష్ ఆగడాలు బయటకు పొక్కినట్లు కూడా కథనం ప్రచారంలో ఉంది.

అతని ఆగడాలకు సంబంధించిన కథనాలు టీవీ ఛానెళ్లలో సోమవారం రోజంతా ప్రసారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అవినాష్‌పై కాకినాడకు చెందిన ఒక మహిళ సోమవారం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన హోంమంత్రి చినరాజప్ప ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని పేర్కొంటూ ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించారు.
అవినాష్‌ను పట్టుకునేందుకు గాలిస్తున్న 6 బృందాలు
అంతర్జాతీయ మానవహక్కుల సంఘం దక్షిణ భారత ఛైర్మన్‌ని అని చెప్పుకుంటూ తూర్పుగోదావరి జిల్లాలో ఆగడాలు సృష్టిస్తున్న అవినాష్‌కోసం అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. ఏపీ హోం మంత్రి పేరు చెప్పుకుని విద్యాసంస్థలు, ఎన్జీవోల నుంచి అవినాష్ డబ్బులు వసూలు చేసిన విషయం తెలిసిందే. అవినాష్ వ్యవహారంపై విచారణాధికారిగా అదనపు ఎస్పీ దామోదర్‌ను నియమించారు. దర్యాప్తు ముమ్మరం చేయాలని హోం మంత్రి చినరాజప్ప ఆదేశించారు.












Click it and Unblock the Notifications