రూటుమార్చిన అమరావతి రైతులు- ఢిల్లీలో నిరసనలకు ప్లాన్ ! ఉద్యమానికి మూడేళ్లు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనతో మొదలైన అమరావతి ఉద్యమం త్వరలో మూడేళ్లు పూర్తి చేసుకోబోతోంది. మరోవైపు అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతూ రైతులు మొదలుపెట్టిన పాదయాత్ర అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రాజధాని రైతులు పాదయాత్రకు ప్రత్యామ్నాయంగా ఢిల్లీలో నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు.
అమరావతి రాజధాని కోసం ఉద్యమం మొదలై డిసెంబర్ 17తో మూడేళ్లు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి అక్కడే నిరసనలు తెలపాలని అమరావతి రైతులు నిర్ణయించారు. తాజా పరిణామాల నేపథ్యంలో అమరావతి రైతులు ఇవాళ తుళ్లూరులో సమావేశం అయ్యారు. అమరావతి ఉద్యమాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఉద్యమానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసన కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించారు.

రాజధానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున ఢిల్లీలో ప్రదర్శన చేపట్టాలని నిశ్చయించారు. సుప్రీంకోర్టులో తుది తీర్పు వచ్చేంతవరకు ఉద్యమం కొనసాగించాలని ఇవాళ జరిగిన సమావేశంలో రైతులు నిర్ణయించారు.తద్వారా కేంద్రంపై కూడా ఒత్తిడి పెంచినట్లవుతుందని భావిస్తున్నారు. డిసెంబర్ లో పార్లమెంటు సమావేశాలు ఉంటాయి. ఈ సమయంలో జాతీయ రాజధానిలో నిరసనలకు దిగడం ద్వారా ఎంపీల దృష్టిని ఆకర్షించవచ్చని వారు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications