పిఠాపురంలో పవన్, చంద్రబాబుకు అవమానం..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆయనతో పాటు సీఎం చంద్రబాబుకూ అవమానం ఎదురైంది. ఇద్దరు రాష్ట్రస్థాయి నేతలను స్థానికంగా నిర్వహించిన ఓ అధికారిక కార్యక్రమంలో అధికారులు విస్మరించారు. దీంతో టీడీపీ, జనసేన నాయకులు భగ్గుమన్నారు. అధికారుల తీరుపై మండిపడిన స్థానిక టీడీపీ నేత వర్మ.. చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిన్న జరిగింది. ఇందులో ఆస్పత్రి డెవలప్మెంట్ కమిటీ ఛైర్మన్, పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కూడా అయిన పవన్ కళ్యాణ్ ఫోటోను అధికారులు ఏర్పాటు చేయలేదు. అంతే కాదు అన్ని ప్రభుత్వ కార్యాలయాల తరహాలో సీఎం చంద్రబాబు ఫొటో కూడా పెట్టాల్సి ఉండగా దాన్నీ విస్మరించారు. దీంతో అక్కడికి వచ్చిన టీడీపీ, జనసేన నాయకులు దీన్ని గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫొటో ఉన్న ఫ్లెక్సీ తెచ్చిపెట్టేవరకూ కార్యక్రమం మొదలుపెట్టడానికి వీల్లేదంటూ జనసైనికులు భీష్మించారు. దీంతో అధికారులు అప్పటికప్పుడు స్పందించి పవన్ ఫ్లెక్సీ తెచ్చిపెట్టారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఫొటో పెట్టకుండా కార్యక్రమాన్ని నడిపిస్తుండడంతో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అయిన వర్మ కూడా సీరియస్ అయ్యారు. ఏకంగా కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు.
పిఠాపురం నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు ఫొటోగానీ, ఇక్కడి ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ఫొటోగానీ అధికారులు పెట్టడం మానేశారని, తనకు మూడు, నాలుగు సార్లు ఇలాంటి అనుభవం ఎదురైందని వర్మ ఆవేదన వ్యక్తం చేశారు.
మరోసారి ఇలా జరిగితే మాత్రం ఉన్నతాధికారులతో చెప్పి సంబంధిత అధికారుల్ని సస్పెండ్ చేయిస్తానని వర్మ హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications