గంటాకు సీటు రాకుండా అడ్డుకుందెవరు - కీలక పరిణామాలు..!!
ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి వర్సస్ వైసీపీ పోరు ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి అభ్యర్దుల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయనుంది. ఇప్పటికే రెండు విడతలుగా 139 మంది అభ్యర్దులను ప్రకటించింది. గంటా శ్రీనివాసరావు సీటు విషయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గంటాకు సీటు దక్కుతుందా, లేదా అనేది ఆసక్తిని పెంచుతోంది.
కొనసాగుతున్న సస్పెన్స్
టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు సీటు వ్యవహారం పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తొలి జాబితాలోనే గంటా కు సీటు రాకపోవటంతో పలు రకాల చర్చలు తెర మీదకు వచ్చాయి. గంటాను ఈ ఎన్నికల్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు సూచించారు. దీని పైన గంటా తన అనుచర వర్గంతో చర్చించారు. తనకు 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేయలేనని..విశాఖ జిల్లాలోనే సీటు కేటాయించాలని కోరారు. కానీ, రెండు జాబితాల్లోనూ గంటాకు సీటు దక్కలేదు. అదే సమయంలో విశాఖ పరిధిలో భీమిలి, విశాఖ సౌత్, విశాఖ నార్త్ నియోజకవర్గాలను ప్రకటించాల్సి ఉంది. సౌత్ సీటు జనసేన, నార్త్ సీటు బీజేపీకి వెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది.

అసలు కారణం అదేనా
భీమిలి సీటు పైన జనసేన నేతలు ఆశలు పెట్టుకున్నారు. అదే స్థానం గంటా ఆశిస్తున్నారు. అయితే, భీమిలి పైన ఇంకా చంద్రబాబు నిర్ణయం తీసుకోలేదు. గంటాతో పాటుగా విశాఖకు చెందిన మరో సీనియర్ నేత బండారు సత్యనారాయణకు సీటు దక్కలేదు. గంటాకు సీటు పెండింగ్ వెనుక అనేక ఆసక్తి కర కారణాలు తెర మీదకు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత గంటా చాలా కాలం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా లేరు. కొంత కాలంగా ఆయన వైసీపీలోకి వెళ్తున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. చంద్రబాబు విశాఖ వచ్చిన సమయంలో..అదే విధంగా లోకేష్ యువగళం సమయంలోనూ గంటా దూరంగా ఉన్న విషయాన్ని పార్టీలోని ఆయన ప్రత్యర్ధులు గుర్తు చేస్తున్నారు. సీటు కేటాయింపులో నాటి శైలే కారణమని ప్రచారం సాగుతోంది.

భీమిలి సీటు దక్కేనా
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం గంటా రాజీనామా చేయటం కూడా విశాఖలోని సొంత పార్టీ నేతలకు సమస్యగా మారింది. దీంతో, ఇప్పుడు గంటాకు సీటు కేటాయించకపోయినా..ఇంకా ఆప్షన్స్ ఓపెన్ గానే ఉన్నాయి. భీమిలి, చీపురుపల్లి స్థానాలు రెండు ప్రకటించాల్సిన జాబితాలోనే ఉన్నాయి. జనసేన ఇప్పటికే 18 స్థానాల్లో తమ అభ్యర్దులను ప్రకటించింది. కాగా, విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు అభ్యర్దులను ప్రకటించాల్సి ఉంది. దీంతో..భీమిలి స్థానం టీడీపీ అభ్యర్దికే ఖరారు కానుంది. గంటాను చివరి నిమిషం వరకు చీపురుపల్లి నుంచి పోటీ పైనే ఒత్తిడి పెంచేలా టీడీపీ నాయకత్వం వ్యవహరిస్తుంది. ఆఖరుగా భీమిలి గంటాకే దక్కుతుందని ఆయన అనుచరవర్గం భావిస్తోంది. దీంతో..గంటా సీటు వ్యవహారం విశాఖలో రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications