జగన్ సర్కార్ కు 'ఎయిడెడ్' సంకటం- బెదిరింపులపై తల్లితండ్రుల్లో టెన్షన్-అమ్మఒడికీ నిరాకరణ
ఏపీలో ప్రైవేటు ఎయిడెడ్ విద్యాసంస్ధల విషయంలో వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న ధోరణి ఇప్పుడు వివాదాస్పదవుతోంది. ఓవైపు విద్యాసంస్ధల్ని బలవంతంగా ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం లేదంటూ హైకోర్టుకు కూడా చెప్పిన ప్రభుత్వం.. మరోవైపు మాత్రం దొడ్డిదారిన వారిని లొంగదీసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం ఒత్తిళ్లు భరించలేక ఎయిడెడ్ స్కూళ్లు మూసివేతకు సిద్ధమవుతున్నాయి. ఇది చివరికి తల్లితండ్రుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. చేసేది లేక తల్లితండ్రులు ప్రభుత్వ తీరుకు నిరసనగా రోడ్డెక్కుతున్నారు.

ఎయిడెడ్ పై కక్ష గట్టిన జగన్ సర్కార్
ఏపీలో ఎయిడెడ్ విద్యాసంస్ధల్ని నయానో, భయానో లొంగదీసుకునేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో బాగంగా ఇప్పటికే విద్యాసంస్ధలకు సర్కులర్ లు పంపి తమ పాఠశాలల్ని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో కాస్త వెనక్కి తగ్గినట్లే కనిపించింది. విలీనంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో అక్కడ తాము స్వచ్చంధంగానే విలీనం చేసుకుంటున్నట్లు చెప్పింది. కానీ బయట జరుగుతుంది మాత్రం వేరు. స్కూళ్లను తమకు అప్పగిస్తే అప్పగించండి, లేకపోతే ప్రైవేటు స్కూళ్లుగా మార్చేసుకోండి, మేం ఎయిడ్ (సాయం) ఇవ్వం. అమ్మఒడి వంటి పథకాల్ని సైతం కట్ చేస్తామని విద్యాశాఖ అధికారులు బెదిరిస్తున్నారు. దీంతో నిరసనలు నానాటికీ పెరుగుతున్నాయి.

విద్యాసంస్ధలకు బెదిరింపులు
రాష్ట్రంలో వేలాదిగా ఉన్న ప్రైవేటు ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలను ప్రభుత్వంలో విలీనం చేయాలని గతంలో నేరుగా సర్కులర్ జారీ చేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత విద్యాసంస్ధలు హైకోర్టును ఆశ్రయించడంతో కాస్త వెనక్కి తగ్గింది. ఎయిడెడ్ విద్యాసంస్ధల్ని బలవతంగా విలీనం చేసుకోవద్దంటూ జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు పంపింది. అయితే అదంతా పైపైనే. అంతర్గతంగా మాత్రం స్కూళ్ల యాజమాన్యాల్ని పలు మార్గాల్లో బెదిరిస్తూనే ఉంది. దీంతో యాజమాన్యాలు బెంబెలేత్తుతున్నాయి. వీరిలో కొందరు ఈ వేధింపులు తాళలేక స్కూళ్లు మూసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

దిక్కుతోచని యాజమాన్యాలు
ఎయిడెడ్ విద్యాసంస్ధలపై ప్రభుత్వం కక్షగట్టినట్లు వ్యవహరిస్తుండటంతో యాజమాన్యాలు బెంబేలెత్తుతున్నాయి. ఇప్పటికే తమకు పరిచయం ఉన్న రాజకీయ నేతల సాయంతో ఈ గండం నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు. స్ధానిక రాజకీయ నేతలు సైతం ఇది ప్రభుత్వ నిర్ణయమంటూ వారికి తేల్చి చెప్పేస్తున్నారు. అంతే కాదు స్కూళ్లను ప్రభుత్వానికి అప్పగిస్తేనే మీకు భవిష్యత్తు ఉంటుందంటూ వారిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దశాబ్దాలుగా ఈ స్కూళ్లనే నమ్ముకుని ఉన్న విద్యాసంస్ధల యాజమాన్యాలు మాత్రం వీటిని ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధపడటం లేదు. దీనికంటే మూసివేతే నయమని భావిస్తున్నారు.

మూసివేతలపై తల్లితండ్రుల నిరసనలు
రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యాసంస్ధల్ని ప్రభుత్వంలో విలీనం చేయడం లేదా ప్రభుత్వ పథకాలకు, సాయానికి దూరమై ప్రైవేటుగా కొనసాగించుకోవడం మాత్రమే ఆప్షన్లుగా మిగలడంతో అవి కాస్తా మూసివేత దిశగా అడుగులేస్తున్నాయి. దీంతో ఇప్పటివరకూ నామమాత్రపు ఫీజులతో పిల్లల్ని వాటిలో చదివించిన తల్లితండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఒక్కసారిగా పాఠశాలలు మూతపడితే తమ పిల్లలకు చదువెలా అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ చదువుతున్న పిల్లల్ని సమీపంలోని ఇతర పాఠశాలలకు తరలించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వారు నిరాకరిస్తున్నారు. దీంతో తాజాగా విశాఖలో తల్లితండ్రులు రోడ్డెక్కారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు.
Recommended Video

అమ్మఒడీ వద్దంటున్న తల్లితండ్రులు
ప్రస్తుతం ప్రభుత్వం మాట విని ఎయిడెడ్ పాఠశాలల విలీనానికి అంగీకరించే యాజమాన్యాల విషయంలో మాత్రమే సర్కార్ కాస్త మెతక వైఖరితో ఉంది. తమ మాట వినకపోతే అమ్మఒడి కింద ఇస్తున్న రూ.15 వేలు ఇవ్వబోమనే హెచ్చరికలు కూడా చేస్తోంది. దీంతో అమ్మఒడి డబ్బులు కోల్పోతామన్న భయంతో అయినా తల్లితండ్రులు స్కూళ్ల యాజమాన్యాలపై వీలీనానికి ఒత్తిడి తెస్తారన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే విచిత్రంగా అమ్మఒడి పథకం కూడా తమకు వద్దని, తమ పిల్లలు చదువుతున్న పాఠశాలల్ని అలాగే కొనసాగించాలని తల్లితండ్రులు తాజాగా విశాఖలో డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇతర ప్రాంతాల్లోనూ ఇవే డిమాండ్లు వినిపిస్తే మాత్రం ప్రభుత్వానికి కష్టాలు తప్పకపోవచ్చు.












Click it and Unblock the Notifications