ఎన్నారైకి టీడీపీ టికెట్: వైసీపీతో టచ్‌లో మాజీ ఎమ్మెల్యే?
TDP Janasena BJP alliance: ఈ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి తెలుగుదేశం పార్టీ.. జనసేన, భారతీయ జనతా పార్టీతో కట్టిన కూటమి ప్రభావం సీనియర్లకు టికెట్లు లేకుండా చేస్తోంది. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయులుగా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ వచ్చిన నాయకులు పొత్తుల వల్ల సీట్లు, టికెట్లను కోల్పోవాల్సి వస్తోంది.
టీడీపీ, జనసేనకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, ఆశావహులు, మాజీ ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్నారు. శివరామరాజు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, కే అప్పల్నాయుడు, యనమల కృష్ణుడు, కేఎస్ జవహర్, జేడీ రాజశేఖర్, పోతిన మహేష్, పితాని బాలకృష్ణ.. వంటి నాయకులు తిరుగుబాటు బాట పట్టారు.

తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన మరో సీనియర్ నేత, మాజీ శాసన సభ్యుడు గవిరెడ్డి రామానాయుడు కూడా చేరే అవకాశాలు లేకపోలేదు. ఆయన పార్టీకి గుడ్‌బై చెబుతారంటూ వార్తలు వస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే ఆయన మంతనాలు సాగిస్తున్నారని చెబుతున్నారు.
అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గానికి చెందిన రామానాయుడికి టికెట్ దక్కలేదనే విషయం తెలిసిందే. ఆయనకు బదులుగా ఎన్నారై పైలా ప్రసాద్‌కు టికెట్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. చివరి నిమిషంలో టికెట్ లేకుండా చేయడం పట్ల రామానాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.
నేడు మాడుగుల నియోజకవర్గంపై తనకు ఉన్న పట్టును నిరూపించుకోవడానికి బల ప్రదర్శన చేయనున్నారు. పలు మండలాల్లో బైక్ ర్యాలీని నిర్వహించనున్నారు. అనంతరం తన అనుచరులతో సమావేశం కానున్నారు రామానాయుడు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయాలను ప్రకటిస్తారని సమాచారం.
2009 ఎన్నికల్లో మాడుగుల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారాయన. 2014, 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థిగా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు గానీ.. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చేతిలో ఓడిపోయారు. ఈ దఫా రామానాయుడిని పక్కన పెట్టారు చంద్రబాబు. పైలా ప్రసాద్‌కు టికెట్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications