బ్రోకరా: బాబుపై రఘువీరా తీవ్రవ్యాఖ్య, ఏచూరి కూడా
హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజధాని విషయంలో ఏకపక్షంగా ముందుకు పోతున్న చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకరా లేక వ్యాపారస్తుడా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
భూసమీకరణతో రైతులకు నష్టమే తప్ప లాభం లేదన్నారు. అసలు ల్యాండ్ పూలింగ్‌కు చట్టబద్ధతే లేదన్నారు. గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పెట్టుబడులు పెట్టిన ప్రయివేటు వ్యక్తులకు ప్రభుత్వం గులాంగిరీ చేస్తోందన్నారు. రాజధాని నిర్మాణానికి వెయ్యి ఎకరాలు సరిపోతాయన్నారు.

రాజధానికి 30వేల ఎకరాలు ఎందుకు అవసరమో చెప్పాలన్నారు. అంత భూమి ఎందుకు అవసరమో చెప్పకుండా రైతులను బెదిరిస్తారా అని ప్రశ్నించారు. రైతులను ప్రభత్వం బ్లాక్ మెయిల్ చేస్తోందన్నారు. సొంత అజెండాతో భూసమీకరణ ఏమాత్రం సరికాదన్నారు.
ఎన్నికల ముందు, తర్వాత పార్టీకి ఉపయోగపడిన వారికే చంద్రబాబు మద్దతుగా ఉంటున్నారని అభిప్రాయపడ్డారు. ఏడాది పొడవునా పంటలు ఇచ్చే భూముల పైన కన్ను పడిందన్నారు. జిల్లాలు, ప్రాంతాల వారిగా విద్వేషాలు వస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రైతులను బ్లాక్ మెయిల్ చేయవద్దన్నారు.
విదేశీ నిపుణులు అవసరం లేదు: సీతారాం ఏచూరీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి విదేశీ నిపుణులు అవసరం లేదని సీపీఎం నేత సీతారాం ఏచూరీ అన్నారు. చంద్రబాబు సొంత అజెండాతో ముందుకు వెళ్లవద్దన్నారు. కొత్త చట్టం ప్రకారమే బాధితులకు పరిహారం ఇవ్వాలన్నారు. రాజధాని కోసం విదేశీ నిపుణులను తీసుకు వచ్చి, వారికి వేల కోట్లు చెల్లించాల్సిన పని లేదన్నారు. దేశీయ నైపుణ్యంతో చత్తీస్‌గఢ్ రాజధాని ఏర్పడిందన్నారు. రైతుల రుణమాఫీ పైన చంద్రబాబు చెప్పిందేమీటి, చేస్తుందేమిటని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications