చంద్రబాబుతో పొత్తుకు కిషన్ రెడ్డి మోకాలడ్డు?
హైదరాబాద్: తమ పార్టీతో పొత్తుకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి మోకాలడ్డుతున్నారని తెలుగుదేశఁ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. తాహతుకు మించి బిజెపి సీట్లు అడుగుతోందని టిడిపి నాయకులు అంటున్నారు. అయితే, కిషన్ రెడ్డి వాదన మరో విధంగా ఉంది. తెలంగాణలో టిడిపి పరిస్థితి పూర్తిగా దిగజారిందని, మోడీ ప్రభావం తెలంగాణ చాలా ఉందని, అలాగే తెలంగాణకు అనుకూల వైఖరి తీసుకోవడం కూడా తమకు అనుకూల వాతావరణాన్ని కల్పించిందని ఆయన అంటున్నారు.
వాదనల మాట సరే, ఎప్పటికప్పుడు పొత్తు కుదిరిందంటూ మీడియాలో వార్తలు వచ్చిన వెంటనే వాటిని కిషన్ రెడ్డి ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉండడం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మింగుడు పడడం లేదని అంటున్నారు. నరేంద్ర మోడీ, రాజ్‌నాథ్ సింగ్ వంటి జాతీయ నాయకులతో నేరుగా మాట్లాడి ఒప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు కూడా కిషన్ రెడ్డి వల్ల సాగడం లేదని అంటున్నారు.
సోమవారం కూడా తెలుగుదేశం పార్టీకి, బిజెపికి మధ్య పొత్తు కుదిరందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. తెలంగాణలో బిజెపికి 45 శాసనసభా స్థానాలు, 8 లోకసభ స్థానాలు ఇవ్వడానికి టిడిపి ముందుకు వచ్చిందని, దీంతో పొత్తు ఖరారైనట్లేనని వార్తలు వచ్చాయి. అయితే, ఆ వెంటనే కిషన్ రెడ్డి ట్విట్టర్‌లో ఆ వార్తలను ఖండించారు. తెలుగుదేశంతో పొత్తు కుదిరినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు.

సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లను పొందడానికి కిషన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. 9 పార్లమెంటు స్థానాలు, 55 శానససభా స్థానాలు కావాలని బిజెపి తెలంగాణ నాయకులు పట్టుపడుతున్నారు.
కాగా, సీమాంధ్రలో కూడా అతి తక్కువ సీట్లతో బిజెపిని తమ భాగస్వామిగా చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. నాలుగు లోకసభ స్థానాలు, 15 శానససభా స్థానాలు ఇస్తామని టిడిపి చెబుతోంది. బిజెపి ఆరు లోకసభ స్థానాలు, 20 శాసనసభా స్థానాలు కావాలని పట్టుబడుతోంది. టిడిపితో పొత్తు ఖరారు కాలేదని, మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని బిజెపి సీమాంధ్ర అధ్యక్షుడు హరిబాబు కూడా చెప్పారు.
సోమవారంనాడు తెలుగుదేశం నాయకులు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు బిజెపి నేతలు ప్రకాష్ జవదేకర్, బండారు దత్తాత్రేయలతో ఢిల్లీలో చర్చలు జరిపారు. కిషన్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నారు. ఆయన రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు.












Click it and Unblock the Notifications