షాక్: కాల్‌మనీ-కృపామణి కేసుకు లింక్! రూ.7లక్షలకి అమ్మేశారు, బలవంతం చేసిన సాయి
ఏలూరు/విజయవాడ: కాల్ మనీ కేసులో రోజుకో దారుణం వెలుగు చూస్తోంది. తాజాగా, కాల్ మనీ కేసుకు నెల రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆత్మహత్య చేసుకున్న కృపామణి కేసుకు సంబంధం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
కృపామణి హత్య కేసులో కాల్ మనీకి లింక్ ఉందని అంటున్నారు. ఇప్పటికే కాల్ మనీ నిర్వాహకులకు సంబంధించిన ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు 'కాల్ మనీ' వల్లే కృపామణి ఆత్మహత్య జరిగిందనే కొత్త నిజాలు వెలుగు చూస్తున్నాయి.

ఏం జరిగింది? బలవంతం చేసిన సాయి శ్రీనివాస్
కృపామణి ఆత్మహత్యకు ముందు.. తాను తన తల్లిదండ్రులు, సాయి శ్రీనివాస్ వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వీడియో సందేశం ఉంచింది. కృపామణి తల్లిదండ్రులు తాము చేసిన అప్పులు తీర్చలేక పోవడం వల్లనే ఆమెను వడ్డీ వ్యాపారి సాయి శ్రీనివాస్‌కు అప్పగించారని తెలుస్తోంది.
అదే కృపామణి ఆత్మహత్యకు కారణమయిందని చెబుతున్నారు. కాల్ మనీ నిర్వాహకులు తల్లిదండ్రుల పైన ఒత్తిడి చేయడంతో, వారు కృపామణిని అమ్మేశారని తెలుస్తోంది. కృపామణిని నిందితుడు సాయి శ్రీనివాస్ బలవంతం చేశాడని చెబుతున్నారు.
మరికొందరి వద్దకు వెళ్లాలని కూడా కృపామణి పైన సాయి శ్రీనివాస్ ఒత్తిడి చేసినట్లుగా అనుమానిస్తున్నారు. కృపామణి తల్లిదండ్రులు రూ.7 లక్షల వడ్డీని తీర్చలేక పోవడంతో కృపామణిని సాయి శ్రీనివాస్‌కు అప్పగించగా, నిందితులు శారీరక అవసరాలు తీర్చుకున్నారని తెలుస్తోంది.
న్యాయం కావాలని భర్త
సాయి శ్రీనివాస్.. కృపామణిని ఏడు లక్షలకు తీసుకున్నాడని ఆమె భర్త పవన్ కుమార్ చెబుతున్నారు. తమకు న్యాయం జరగాలన్నారు. కుటుంబ సభ్యురాలు ఒకరు మాట్లాడుతూ... అప్పు తీర్చలేకేనే కృపామణిని అమ్మేశారని, కృపామణిని అడ్డమైన ప్రశ్నలు అడిగారని ఆవేదన వ్యక్తం చేశారు.
కృపామణి చాలా మంచిదని, చనిపోయేందుకు సాయి శ్రీనివాస్, ఆమె తల్లిదండ్రులే కారణమన్నారు. ఆమె పట్ల దారుణంగా వ్యవహరించారన్నారు. బంగారు భవిష్యత్తు చూపిస్తామని చెప్పి చంపేశారని కంటతడి పెట్టారు. కృపామణి హత్య కేసులో నిందితులను ఉరితీయాలన్నారు.












Click it and Unblock the Notifications