రాజధాని:బాబుపై ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉన్నారా?
విశాఖపట్నం: విజయవాడను రాజధానిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం పట్ల జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆదివారం స్థానిక సర్క్యూట్ హౌస్‌లో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.
ఇందులో ప్రధానంగా రాజధాని అంశంపై ఎక్కువగా చర్చించారు. రాజధాని ఏర్పాటు విషయంలో విశాఖకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది. చంద్రబాబు కొంతమంది వత్తిడికి తలొగ్గి విజయవాడను రాజధానిగా ప్రకటించారని వారు ఆవేదన వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి.

శివరామకృష్ణన్ కమిటీ కూడా విశాఖకే ఎక్కువ మార్కులు వేసిందని, తీర ప్రాంతంలో ఉన్న విశాఖను రాజధానిగా చేస్తే, శరవేగంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని వారు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారని తెలుస్తోంది. రాజధాని నిర్మాణానికి విశాఖ అనువుగా ఉన్నప్పటికీ విజయవాడ ప్రాంతాన్ని ఎంపిక చేయడం పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారంటున్నారు.
రాజధాని ఎంపికపై తాము మాట్లాడలేని పరిస్థితి తీసుకువచ్చారని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారని వినికిడి. జిల్లాల వారీగా చంద్రబాబు ప్రకటించిన ప్రాజెక్ట్‌ల్లో కూడా విశాఖకు అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. విశాఖకు ఐఐటి ఇస్తామని, చివరకు ఐఐఎం ఇచ్చారని, దీని వలన పెద్దగా ప్రయోజనం లేదని, చెన్నైలో ఐఐటి ఉండగా, అక్కడికి సమీపంలోని చిత్తూరులో మరో ఐఐటి ఏర్పాటు పట్ల ఎమ్మెల్యేలు ఆక్షేపణ వ్యక్తం చేశారని అంటున్నారు.












Click it and Unblock the Notifications