చంద్రబాబుకు ఎసరు?: ప్రజల్లో ఉన్న అసంతృప్తిపై వైసీపీ వ్యూహ రచన
అమరావతి: వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నాలుగు నెలల క్రితం చేపట్టిన గడప గడపకు కార్యక్రమం దాదాపూ 80 శాతం వరకూ పూర్తయింది. వైయస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది జూన్ 8వ తేదీన ఈ కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
ప్రజా సమస్యలతో పాటు అధికార పనితీరుని ఎండగట్టేందుకే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వైసీపీ అధినేత వైయస్ జగన్ ప్రకటించారు. నిజానికి వైసీపీ ఈ గడప గడపకు కార్యక్రమాన్ని చేపట్టడం వెనుక వేరే కారణం ఉందని తెలుస్తోంది. ప్రజల్లో అధికార పార్టీపై ఏ మేరకు వ్యతిరేకత ఉందనే అభిప్రాయం తెలుసుకోవడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
వైసీపీ చేపట్టిన గడప గడపకు కార్యక్రమాన్ని టీడీపీ ముందుగానే పసిగట్టినా ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం మంచిదికాదన్న ఉద్దేశంతో ఆగిపోయింది. దీంతో ఇప్పుడు ఈ కార్యక్రమం అధికార పార్టీకి ఎసరు తెచ్చేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షమే పథకాలు ప్రజల్లోకి వెళ్లకపోవడంతో అందులోని లోపాలను వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుంటుంది.

గ్రామాల్లో అయితే రేషన్ బియ్యం పథకం పూర్తిగా అటకెక్కేసింది. ఉదాహరణకు రేషన్ బియ్యం కోసం కుటుంబంలోని సభ్యులందరి వేలి ముద్రలు తీసుకుంటారు. అందులో ఎవ్వరు వెళ్లినా రేషన్ ఇవ్వాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో చాలా చోట్ల ఆ విధంగా జరగడం లేదన్న విషయం వైసీపీ దృష్టికి వచ్చిందని తెలుస్తోంది.
మరికొన్ని చోట్ల కుటుంబంలో ఒక్క వ్యక్తికి మాత్రమే రేషన్ ఇచ్చి, మిగిలిన వారికి రేషన్ కట్ చేసినట్టు డీలర్లు చెపుతున్నట్టు వీరి దృష్టికి తీసుకొస్తున్నారు. అంతేకాదు పేద, మధ్య తరగతి కుటుంబాల వారు తమకు జరిగిన అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక లబ్దిదారులు వైసీపీ నేతలతో తమ గోడుని వెళ్లబోసుకుంటున్నారట.
దీంతో పాటు వికలాంగుల పించన్లను తొలగించడం, రేషన్ కార్డులో తప్పుగా నమోదైన వయసును ఆధారంగా తీసుకుని పించను తొలగించడం వంటి అనేక అంశాలపట్ల ప్రజల్లో అసంతృప్తి పేరుకుపోయినట్టు చెపుతున్నారు. వీటితో పాట ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి, నగరంలోని అనేక వార్డుల్లో టీడీపీ నేతలు ఒక్కో కుటుంబం నుంచి 25 నుంచి 50 వేల రూపాయలు వసూలు చేస్తున్నారట.
ఇళ్లు మంజూరైన తర్వాత లక్ష నుంచి రెండు లక్షల వరకు కూడా డిమాండ్ చేస్తున్నారట. ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వంపై ప్రజలను అసంతృప్తికి గురి చేస్తున్నాయట. మరీ ముఖ్యంగా గ్రామాల్లో టీడీపీ నేతల విచ్చలవిడి తనంగా బాగా పెరిగిపోయిందని ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు.
ప్రభుత్వం పట్ల ప్రజల్లో పేరుకుపోతున్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు వైసీపీ వ్యూహ రచన చేస్తోంది. ప్రజల నుంచి ఏయే అంశాల్లో వ్యతిరేక వ్యక్తమవుతోందో పార్టీ అధ్యక్షుడు జగన్‌కు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications