ఏపీలో రెండ్రోజులపాటు వర్షాలు, పిడుగులు పడే అవకాశం: సీమలో మాత్రం ఎండలే
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉత్తర జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడినందున, దీని ప్రభావంతో శుక్రవారం, శనివారం ఏపీలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురియనున్నాయి.
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని, పెను గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది.

దక్షిణ మహారాష్ట్ర నుంచి మరాట్వాడా మీదుగా విదర్భ వరకూ కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి కారణంగా పశ్చిమగోదావరి, విజయనగరం, కృష్ణా, అనంతపురం జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ తేలికపాటి జల్లులు కురుస్తాయని, ఆకాశం మేఘావృతమై, సగటు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపింది. రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉండనుందని తెలిపింది. రాయలసీమలో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications