Chandrayaan 3 : తిరుమలలో ఇస్రో శాస్త్రవేత్తలు-చంద్రయాన్ 3 డమ్మీ రాకెట్ కు పూజలు...
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్ 3 ప్రయోగానికి ఇవాళ కౌంట్ డౌన్ ప్రారంభం కాబోతోంది. రేపు మధ్యాహ్నం 2.35 నిమిషాలకు చంద్రయాన్ 3 మిషన్ నింగిలోకి ఎగరబోతోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత్ ప్రతిష్ట దశదిశలకూ వ్యాపించబోతోంది. అగ్రరాజ్యాల సరసన భారత్ నిలిచేందుకు ఈ ప్రయోగం భారత్ కు అత్యంత కీలకంగా మారిపోయింది. దీంతో చంద్రయాన్ 3 మిషన్ లో పాల్గొంటున్న ఇస్రో శాస్త్రవేత్తలు ఇవాళ తిరుమలకు వచ్చారు.
Recommended Video

ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తో పాటు ఇతర శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటూ రాకెట్ నమూనాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కోరుతూ శ్రీవారికి ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఇస్రో శాస్త్రవేత్తల రాక సందర్భంగా తిరుమలలో ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతీ ప్రయోగానికి ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

తిరుమల శ్రీవారి ఆశీస్సులతో పాటు దేశ ప్రజల ఆశీస్సులు, మద్దతు తమకుండాలని ఇస్రో శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. దేశం ఆశల్ని మోసుకుంటూ రేపు చంద్రయాన్ 3 నింగికెగిరేందుకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రేపు మధ్యాహ్నం సరిగ్గా 2:35:13 గంటలకు శ్రీహరికోట షార్ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3పీ4 రాకెట్ ను నింగిలోకి మోసుకెళ్లబోతోంది. దీంతోపాటే దేశ ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని కూడా మోసుకెళ్లబోతోంది. ఈ ప్రయోగం జరిగేది రేపే అయినా ఇది విజయవంతం అయిందో లేదో పూర్తిగా తెలియాలంటే మాత్రం 40 రోజులు ఆగక తప్పదు.
చంద్రయాన్-3 ప్రయోగం నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు#Chandrayan #Chandrayaan3 #ISRO #IndianSpaceResearchOrganisation #TirumalaTemple #Oneindiatelugu pic.twitter.com/OMJXsEKKcE
— oneindiatelugu (@oneindiatelugu) July 13, 2023
ఈ నేపథ్యంలో శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంపై దేశ ప్రజల దృష్టి నెలకొని ఉంది. అత్యంత పటిష్టమైన భద్రత మధ్య ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో సిద్దమైంది. గతంలో చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో ఈసారి రెట్టించిన ఉత్సాహంతో దీన్ని ఎలాగైనా విజయవంతం చేసేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దాదాపు 600 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఈ ప్రయోగం చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications