ఏపీ, తెలంగాణాలలో మళ్ళీ ఐటీ దాడుల కలకలం: ఈసారి టార్గెట్ వీళ్ళే!!
తెలుగు రాష్ట్రాలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు వదలడం లేదు. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేసి దాడులు చేస్తారో అర్ధం కాని పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఈరోజు ఒక్కసారిగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. నిన్న మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ సంస్థలు, సినిమా రంగానికి చెందిన పలు నిర్మాణ సంస్థలలో దాడులు నిర్వహించిన ఐటి అధికారులు తాజాగా తెలుగు రాష్ట్రాలలోని వస్త్ర దుకాణాలపై ఫోకస్ పెట్టారు.
చాలా షాపింగ్ మాల్స్ యజమానులు ఆదాయపు పన్ను శాఖకు చెల్లించాల్సిన ఆదాయపుపన్ను పెద్దమొత్తంలో ఎగరవేశారు అన్న ఆరోపణలపై సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాదు, విశాఖపట్నంతో పాటుగా విజయవాడలో కూడా ప్రస్తుతం ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. వైజాగ్ కు చెందిన పలువురు వ్యాపారుల ఇళ్లల్లో కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

కళామందిర్, కాంచీపురం సిల్క్, కె.ఎల్.ఎమ్ ఫ్యాషన్ మాల్, వరమహాలక్ష్మి వంటి షాపింగ్ మాల్స్ కార్యాలయాలు మరియు యజమానుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.40 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్న ఐటి అధికారులు ఈరోజు తెల్లవారుజాము నుంచి సోదాలు చేస్తున్నారు. నేడు ఉదయం 6 గంటలకే కళామందిర్ డైరెక్టర్లు శిరీష చింతపల్లి, ప్రమోద్ ఇళ్లకి చేరుకున్న ఐటీ అధికారులు నాలుగు గంటల పాటు వారిద్దరి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు.
హైదరాబాద్ కాక మొత్తం 20 కి పైగా ప్రాంతాలలో 40 బృందాలుగా విడిపోయిన అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే 40 చోట్ల ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ గచ్చిబౌలి మాదాపూర్ ప్రాంతాలలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ సోదాల అనంతరం అధికారులు వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.












Click it and Unblock the Notifications