విద్యుత్ కోతల వెనుక - అసలు కారణాలు ఇవే : చెల్లింపులు చేస్తేనే..!!
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అప్రకటిత విద్యుత్ కోతలు అమలు అవుతున్నాయి. అయితే, దీని వెనుక పలు కారణాలు బయటకు వస్తున్నాయి. ఎన్టీపీసీకి రాష్ట్ర డిస్కంలు బకాయిపడ్డ మొత్తం విషయంలో స్పందించకపోవడం వల్లే అక్కడి నుంచి సరఫరా నిలిచిపోయి రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలయినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీకి డిస్కంలు రూ.350 కోట్ల బకాయి పడ్డాయని చెబుతున్నారు. వీటిని చెల్లించాలంటూ ఎన్టీపీసీ రెండు నెలలుగా డిస్కంలకు లేఖలు రాస్తున్నా..స్పందన లేకపోవడంతో ఎన్టీపీసీ నుంచి రావాల్సిన 800 మెగావాట్ల విద్యుత్‌ను నిలిపేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

అనధికార కోతలు అమలు
అదే సమయంలో.. ఎన్టీపీసీ బకాయిల వ్యవహారం పరిష్కారమయ్యే వరకూ బహిరంగ మార్కెట్‌లో కొనేందుకూ అవకాశం లేకుండా బ్లాక్ చేశారు. దీంతో..డిస్కంలు రెండు రోజులుగా కోతలు అమలు చేస్తున్నాయి. ఎన్టీపీసీకి చెందిన విశాఖ సింహాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 800 మెగావాట్ల విద్యుత్‌ను డిస్కంలు తీసుకుంటున్నాయి. ఈ సంస్థకు సుమారు రూ.350 కోట్లను డిస్కంలు బకాయి పడ్డాయి. కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ నిబంధనల ప్రకారం బకాయిలు చెల్లించనందున బహిరంగ మార్కెట్ కొనుగోలుకు అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.

ఉత్పత్తి పెంచాలని ఆదేశాలు
దీంతో గురువారమే 3వేల మెగావాట్ల కొరత ఏర్పడింది. దీని సర్దుబాటుకు జెన్‌కో థర్మల్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి పెంచాలని ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో శుక్రవారం కూడా విద్యుత్ కోతలు తప్పలేదు. రాష్ట్రంలో డిమాండ్ 170.542 మిలియన్ యూనిట్లకు, పరిశ్రమలు, వ్యవసాయ కనెక్షన్లకు కోత విధించడంతో 24 ఎంయూలకు డిమాండ్ తగ్గినా కోతలు అనివార్యమయ్యాయి.
డిస్కంలు మరో 22.38 ఎంయూలను కోతల రూపేణా సర్దుబాటు చేశాయి. శుక్రవారం పీక్ డిమాండ్ సమయంలో వంతుల వారీగా గ్రామీణ ప్రాంతాల్లో 2-3 గంటల పాటు కోతలు విధించాయి. థర్మల్ యూనిట్ల నుంచి ఉత్పత్తి పెంచాలంటే కనీసం 6 టైం బ్లాక్‌లు (ఒక్కొక్కటి 15 నిమిషాలు) ముందుగా చెప్పాలి.
Recommended Video

సాంకేతిక లోపాలు కారణమే
వెంటనే ఉత్పత్తి పెంచాలని ఒత్తిడి చేయడంతో జెన్‌కోకు చెందిన కృష్ణపట్నం, విజయవాడలోని వీటీపీఎస్‌ల బాయిలర్లలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఈ రెండింటి నుంచి కలిపి రోజుకు 1300 మెగావాట్ల విద్యుత్ వస్తుంది. వీటిని శనివారం ఉదయం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని జెన్‌కో అధికారులు తెలిపారు. ఉత్పత్తిని కొనసాగించాలన్నా థర్మల్‌ప్లాంట్ల దగ్గర బొగ్గునిల్వలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. థర్మల్‌యూనిట్లు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రోజుకు 65వేల టన్నుల బొగ్గు కావాలి. ప్రస్తుత నిల్వలు రెండుమూడు రోజులకే సరిపోతాయి.












Click it and Unblock the Notifications