దిశ కేసులో ఫేక్ ఎన్ కౌంటర్ చేశారు: పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్య
రాజమహేంద్రవరం: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యచార ఘటనలో జరిగిన ఎన్‌కౌంటర్‌ను బూటకపు ఎన్‌కౌంటర్‌గా అభివర్ణించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజమహేంద్రవరంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవంలో అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తనకు పిరికివారన్న పిరికితనం అన్నా అస్సలు ఇష్టం ఉండదని చెప్పారు. ప్రాణాలకు తెగించి తాను జనసేన పార్టీని స్థాపించినట్లు చెప్పిన పవన్ కళ్యాణ్.. పార్టీ పెట్టే నాటికి అన్నీ ప్రతికూల పరిస్థితులే ఉన్నాయని గుర్తు చేశారు.

ప్రతికూల పరిస్థితుల్లో పార్టీని స్థాపించాను
ఇవాల్టితో ఆరేళ్లు పూర్తి చేసుకున్న జనసేన పార్టీ... తాను పార్టీని స్థాపించేనాటికి తన పక్కన మేధావులు ఎవరూ లేరని జనసేనాని గుర్తు చేశారు. ప్రాణాలకు తెగించి పార్టీ స్థాపించినట్లు చెప్పారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వ యంత్రాంగానికి బానిసల్లా తయారయ్యామని పవన్ చెప్పారు. యువతను నమ్మి తాను పార్టీని స్థాపించానని చెప్పిన పవన్ కళ్యాణ్.. గతేడాది రాజమహేంద్రవరంలో జరిగిన కవాతులో కొన్ని లక్షలమంది వచ్చారని చెప్పారు. అయితే వారంతా ఓటు వేయలేదని చెప్పారు. అంతా క్రిమినల్స్‌ను ప్రోత్సహించేవారికి నేరాలను ప్రోత్సహించేవారికే ఓటు వేశారని అన్నారు. స్వాతంత్ర సమరయోధులను గుండెల్లో పెట్టుకుని పూజించే వారు ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం క్రిమినల్స్‌ను ఎన్నుకుంటారని అది సమాజం నుంచి వెళ్లిపోవాలని అన్నారు.

అభిప్రాయం చెప్పలేని స్థితిలో ఉన్నాం
తనకు సినిమా పరంగా మంచి లైఫ్ ఉందని అయితే ప్రజల కోసం సమాజం కోసం ఏదో చేయాలన్న తపన తనకుండేదని చెప్పారు. అందుకే జనసేన పార్టీ ఏర్పాటు చేశామని చెప్పారు. పిరికితనం చాలా చిరాకు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎంతో మంది నాయకుల గురించి తెలుసుకుని ఇంకా భయపడితే అర్థం ఉండదని చెప్పారు. కనీసం అభిప్రాయం కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నామని చెప్పారు. తను పార్టీ పెట్టిన తొలినాళ్లలో మరో కులంతో కలిస్తే ఇంకో కులంను దెబ్బతీయొచ్చని చెప్పేవారు మాత్రమే ఉన్నారని మానవత్వం నశించిపోతోంది దీన్ని కాపాడుదామని చెప్పిన వారు లేరని పవన్ కళ్యాణ్ చెప్పారు.

వరుస ఫ్లాప్‌లు వచ్చినా...
ఒక ఓటమి తీసుకోవడం ఎంత కష్టమో తనకు తెలుసని అన్నారు పవన్ కళ్యాణ్. ఐదేళ్ల పాటు వరుస హిట్లు వచ్చాక పదేళ్ల పాటు తనకు సంబంధించి ఒక్క సినిమా హిట్ కాలేదని చెప్పారు. ఓటమి తీసుకునేందుకు సిద్ధంగా ఉంటేనే రంగంలోకి దిగాలని చెప్పారు. ఎన్నికల కోసం తాను ఆలోచించడం లేదని రాబోయే తరాలవారికోసమే తాను తపన పడుతున్నట్లు చెప్పారు. పది మంది మెదళ్లను మార్చగలిగే వారే నాయకులు అని చెప్పారు. గెలవడం తెలిసిన వాడిని కనుక ఓటమిని తీసుకోగలుగుతున్నాని జనసేనాని చెప్పారు.

జనసేన ఉనికి లేకపోతే పవన్ బతికిఉండడు
జనసేన ఉనికిని చంపేస్తే పవన్ కళ్యాణ్ అనేవాడు చనిపోతాడని చెప్పారు వపన్ . ప్రజాప్రయోజనాల కోసమే బీజేపీతో జతకట్టినట్లు పవన్ చెప్పారు. జనసేన ఏదో ఒక రోజు విజయం సాధిస్తుందని చెప్పారు. తిత్లీ తుఫాను శ్రీకాకుళంను చిదిమేస్తే జనసేన అక్కడికి వెళ్లి సహాయచర్యలు చేపట్టిందని చెప్పిన పవన్ కళ్యాణ్... సీఎం జగన్ పక్క జిల్లా పర్యటనలో ఉన్నప్పటికీ శ్రీకాకుళం వైపు చూడలేదన్నారు. అయితే ఓడిపోవడం జనసేన తప్పుకాదని అలాంటి వ్యక్తికి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలది తప్పని పవన్ కళ్యాణ్ అన్నారు.

జనసేన ఒత్తిడితోనే సీబీఐకి సుగాలి ప్రీతి కేసు
సుగాలి ప్రీతి కేసు జనసేన లేకపోతే వెలుగులోకి వచ్చేది కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వం సీబీఐకి ఇచ్చేది కాదన్నారు. తన తల్లిని కొందరు దూషించారని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఆ సమయంలో తనకు చాలా కోపం వచ్చిందని అదే సమయంలో సహనంతో ఉన్నాను కాబట్టే ఒక పార్టీని పెట్టగలిగానని వెల్లడించారు. కోపంను అధిగమించి సమాజం కోసం మేలు చేయాలన్న తపనతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు జనసేనాని చెప్పారు.












Click it and Unblock the Notifications