టిఆర్ఎస్‌తో పొత్తు బాగుండేది: దత్తాత్రేయ, కుదర్లేదని..
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో పొత్తు ఉంటే బాగుండేదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందిన బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. కొన్ని కారణాల వల్ల ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకోలేకపోయామని చెప్పారు.
ఆయన బుధవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఉంటే తెలంగాణలో మరిన్ని స్థానాలు దక్కించుకునే అవకాశం ఉండేదని ఆయన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. టిడిపితో పొత్తు పెట్టుకున్న బిజెపి.. తెలంగాణలో ఒక ఎంపీతోపాటు ఐదు ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంది.

కాగా, తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకుని బరిలోకి దిగిన బిజెపి నష్టపోయామనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లో మాత్రం తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు కొంత మేర బిజెపికి కలిసొచ్చినట్లుగానే చెప్పవచ్చు.
బిజెపికి అన్ని పార్టీల మద్దతు అవసరం ఉంటుందని దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణ పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అందుకే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించారన్నారు. కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావంతో ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకున్నట్లు దత్తాత్రేయ చెప్పారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు దత్తాత్రేయ తెలిపారు.












Click it and Unblock the Notifications