వైఎస్సార్ ఘాట్ సాక్షిగా జగన్, షర్మిల - విజయమ్మ కన్నీరు, ఓదార్పు..!!
వైఎస్సార్ ఘాట్ వద్ద ఉద్విగ్న సన్నివేశం కనిపించింది. వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు నివాళి అర్పించారు. జగన్ మూడు రోజులుగా పులివెందులలో బస చేసారు. షర్మిల తన కుటుంబ సభ్యులతో ఇడుపులపాయలోనే ఉన్నారు. ఈ ఉదయం ఇద్దరూ వేర్వేరుగా తమ తండ్రికి నివాళి అర్పించారు. ఘాట్ వద్ద జగన్ ను ఆలింగనం చేసుకున్న విజయమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. జగన్ సైతం ఎమోషనల్ అయ్యారు.
జగన్ నివాళి
మాజీ ముఖ్యమంత్రి జగన్ తన తల్లి విజయమ్మ, సతీమణి భారతితో సహా పార్టీ నేతలతో కలిసి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. విమలమ్మ ప్రత్యేకంగా ప్రార్ధనలు చేసారు. ఘాట్ వద్దకు జగన్ రాగానే విజయమ్మ ఎమోషనల్ అయ్యారు. ఎన్నికల్లో పరాజయం తరువాత ఇద్దరు కలిసి ఓపెన్ గా కనిపించటం ఇదే తొలి సారి. జగన్ ను ఆలింగనం చేసుకొని విజయమ్మ ముద్దాడారు. ఆ సమయంలో జగన్ సైతం ఉద్వేగానికి లోనయ్యారు. కుమారుడిని చూసిన విజయమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తరువాత వైఎస్సార్ కు నివాళి అర్పించారు.

విజయమ్మ ఉద్వేగం
ప్రార్దనల తరువాత జగన్ అక్కడే ఉన్న కుటుంబ సభ్యులను పలకరించారు. విజయమ్మ కన్నీటిని గమనించిన సోదరుడు రవీంద్రనాధ్ రెడ్డి ఓదార్చారు. ఆ తరువాత కాసేటికి షర్మిల తన కుటుంబ సభ్యులతో వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. తల్లి విజయమ్మ సహా, అనిల్ కుమార్, కుమార్తెతో పాటుగా కుమారుడు - కోడలుతో పాటుగా ప్రార్దనల్లో పాల్గొన్నారు. ఎన్నికల్లో తన అన్న జగన్ కు వ్యతిరేకంగా షర్మిల ప్రచారం చేసారు. ఎన్నికల ఫలితాల తరువాత కుటుంబలో తాజా పరిణామాల పైన చర్చ జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
షర్మిల ఆహ్వానంతో
వైసీపీ ఈ రోజు వైఎస్సార్ జన్మదినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది. అటు షర్మిల పీసీసీ చీఫ్ హోదాలో విజయవాడలో వైఎస్సార్ జన్మదినోత్సవం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ తో పాటుగా తెలంగాణ మంత్రులు హాజరు కానున్నారు. ఇతర పార్టీల ముఖ్యులకు ఆహ్వానాలు పంపారు. వైఎస్సార్ కుమార్తె, కుమారుడు ఇలా వేర్వేరుగా కొనసాగిస్తున్న రాజకీయ ప్రయాణం..పరిణామాల పైన రాజశేఖర రెడ్డి అభిమానుల్లో చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications