జిల్లాలపై ఫోకస్: టార్గెట్ ఒంగోలు.. ప్లాన్ రెడీ చేస్తోన్న జగన్
ఒంగోలులో రాజకీయ పలుకుబడి కలిగిన కొంతమంది కాంగ్రెస్ పెద్దలను తనవైపుకు తిప్పుకునేందుకు జగన్ మంతనాలు సాగిస్తున్నట్టుగా చర్చ జరుగుతోంది.
ఒంగోలు: 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేసే పనిలో వైసీపీ అధినేత జగన్ నిమగ్నమయ్యారు. ఒక్కో జిల్లాను టార్గెట్ చేస్తూ పార్టీ బలోపేతం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన కాసు కృష్ణారెడ్డి కుమారుడు కాసు మహేష్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా జగన్ ఒంగోలుపై ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒంగోలులో రాజకీయ పలుకుబడి కలిగిన కొంతమంది కాంగ్రెస్ పెద్దలను తనవైపుకు తిప్పుకునేందుకు జగన్ మంతనాలు సాగిస్తున్నట్టుగా చర్చ జరుగుతోంది. కాగా, కాంగ్రెస్ మాజీ నేతలు గనుక వైసీపీలో అడుగుపెడితే పార్టీకి అది కలిసొస్తుందనే చెప్పాలి.

ముఖ్యంగా కందుకూరుకు చెందిన మాజీ మంత్రి మహీధర్ రెడ్డి వైసీపీలో గనుక చేరితే.. ఆ నియోజకవర్గంలో వైసీపీ పాగా వేయవచ్చనే యోచనలో జగన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా గతంలోనే మహీధర్ రెడ్డి వైసీపీలో చేరుతున్నారన్న ప్రచారం జోరుగా జరిగినప్పటికీ.. అది కేవలం వార్తలకే పరిమితమైపోయింది.
మహీధర్ రెడ్డి పార్టీలో చేరకపోవడంతో తుమాటి మాధవరావును నియోజవర్గ ఇంఛార్జీ వైసీపీ నియమించింది. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రస్తుతం నియోజవర్గంలో పర్యటిస్తున్నారు. మహీధర్ రెడ్డి తన స్వంత ప్యానెల్ ను రంగంలోకి దింపే ప్రయత్నాల్లో ఉండటంతో మునిసిపల్ పోరు హోరాహోరీగా సాగే అవకాశాలున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ రాజకీయ సమీకరణాలు తారుమారయ్యే అవకాశం కూడా లేకపోలేదన్న వాదన ఉంది.
ఇక కనిగిరి నియోజవర్గానికి వస్తే.. మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి వైసీపీలో చేరినప్పటికీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అలాగే మాజీ శాసనసభ్యుడు ముక్కు ఉగ్రనరసింహరెడ్డి కూడా ప్రస్తుతం రాజకీయాలను పక్కనబెట్టేశారు. కాగా, వీరిద్దరి ప్రభావం నియోజవర్గంలో బలంగా ఉన్నందునా.. కాశిరెడ్డిని యాక్టివ్ చేయడంతో పాటు, ఉగ్రనరసింహరెడ్డిని పార్టీలోకి తీసుకురావాలనే యోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం.
మొత్తంగా ఒక్కో జిల్లాపై ఫోకస్ చేస్తూ.. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలాలు బలహీనతలను అంచనావేస్తూ జగన్ పార్టీ బలోపేతం కోసం వ్యూహాలు రచిస్తున్నట్టుగా స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications