ధర్నాకి సిద్ధమవుతోన్న జగన్..
పార్టీ ఫిరాయింపులతో ఏపీలో అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే పార్టీ ఫిరాయింపుల అంశాన్ని కాస్త పక్కకు పెట్టి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించుకుంది వైసీపీ. ఈ మేరకు మే 2వ తేదీన రాష్ట్రంలోని అన్ని ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రామాలు నిర్వహించబోతున్నామని, వైసీపీ అధినేత జగన్ గుంటూరు జిల్లా మాచర్లలో జరిగే ధర్నాలో పాల్గొంటారని పార్టీ నేత పార్థసారథి తెలియజేశారు.
జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పార్థసారథి.. రెండేళ్ళ తర్వాతరాయలసీమను కోనసీమ చేస్తానంటున్న చంద్రబాబు ప్రస్తుతం అనంతపురంలో తాగడానికి గుక్కెడు నీళ్ళు లేని విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. చేతనైతే అక్కడి ప్రజలను కరువు పరిస్థితుల నుంచి గట్టెక్కించాలని, అది మర్చిపోయి రెండేళ్ల తర్వాత రాయలసీమను కోనసీమ చేస్తామని చెప్పడం ప్రజలను ఊహల్లో మభ్య పెట్టడానికేనని చెప్పుకొచ్చారు.

చాలా ప్రాంతాల్లో పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడిందని పట్టించుకోవాల్సిన ప్రభుత్వం సమస్యలను గాలికి వదిలేసిందని వ్యాఖ్యానించారు పార్థసారథి. పనిలో పనిగా మైసూరా రెడ్డి పార్టీ వీడడంపై స్పందించిన పార్థసారథి సొంత ప్రయోజనాలను కాపాడుకునేందుకే ఆయన పార్టీని వీడినట్టుగా ఆరోపించారు. వెళ్ళేవారు వెళ్ళక పార్టీపై లేనిపోని నిందలు వేయడం నేతల దిగజారుడు తనానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు పార్థసారథి.












Click it and Unblock the Notifications