చంద్రబాబు ట్రాప్ లో జగన్ ప్రభుత్వం?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. కానీ ఆయన ప్రచార రథం పోలీసుల స్వాధీనంలో ఉంది. పర్యటనను కూడా అడ్డగించారు. దీంతో నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఒకరకంగా పోలీసులే చంద్రబాబును ప్రజలకు చేరువ చేస్తున్నారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జీవో నెంబరు 1 ద్వారా అడ్డగిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ దీనివల్ల చంద్రబాబుపై కుప్పం నియోజకవర్గంలో సానుభూతి పెరుగుతోంది. పోలీసులు అడ్డుకోకుండా ఉంటే ఆయన రోడ్ షో లు చేసి వెళ్లిపోయేవారు. ఇప్పుడు బలవంతంగా అడ్డుకోవడంవల్ల ఇంటింటికీ తిరుగుతున్నారు. గడప గడపకు పాదయాత్రలా చేస్తుంటే నియోజకవర్గ ప్రజల్లో ఆయనపై సానుభూతి వ్యక్తమవుతోంది. ఇదే సానుభూతి ఓట్ల రూపంలోకి మళ్లుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబునాయుడు ఎన్నికల సమయానికికానీ, ఎన్నికల సమయంలోకానీ తన సొంత నియోజకవర్గం కుప్పంలో కచ్చితంగా పర్యటించాల్సి ఉంటుంది. ప్రతిసారి జీవో నెంబరు 1 ద్వారా అడ్డుకుంటుంటే పోలీసులే చంద్రబాబును గెలిపించేటట్లున్నారంటూ సెటైర్లు వస్తున్నాయి.

ఒకరకంగా ఈ కుప్పం యాత్ర చంద్రబాబుకు కలిసివచ్చిందని భావించవచ్చు. కందుకూరు, గుంటూరు ఘటనలద్వారా వచ్చిన నెగెటివ్ కుప్పంతో పాజిటివ్ గా మారిపోయింది. సొంత నియోజకవర్గంలోనే తనను పర్యటించకుండా చేస్తున్నారంటూ ఆయన జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నారు. ఒకరకంగా చంద్రబాబు ఏం కోరుకుంటున్నారో ప్రభుత్వం కూడా అదే చేస్తోందంటున్నారు. తనకు తెలియకుండా చంద్రబాబు ట్రాప్ లో పడిపోయిందని, ఆయనకు సానుభూతి వెల్లువెత్తేలా చేస్తోందంటున్నారు.












Click it and Unblock the Notifications