జగన్ సర్కార్ కీలక నిర్ణయం-రమ్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు-హోంమంత్రి సుచరిత
గుంటూరులో గత నెలలో ప్రేమించలేదని ఉన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన రమ్య కేసులో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. విపక్షాలు దీనిపై నిత్యం విమర్శలు చేస్తుండటం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. దీంతో రమ్య కేసులో విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. గుంటూరులోని రమ్య నివాసానికి వెళ్లి హోంమంత్రి సుచరిత ఈ మేరకు ప్రకటన చేశారు.
ఇవాళ మరోసారి రమ్య కుటుంబ సభ్యులతో భేటీ అయిన హోంమంత్రి మేకతోటి సుచరిత వారికి గతంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని తెలిపారు. అదే క్రమంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి రమ్య కేసు అప్పగిస్తామన్నారు. తద్వారా సత్వర న్యాయం జరిగేందుకు వీలు కలుగుతుందన్నారు. సీఎం జగన్ తో తాజాగా రమ్య కుటుంబ సభ్యుల భేటీ సందర్భంగా ఇచ్చిన రమ్య సోదరికి ఉద్యోగ హామీతో పాటు ఐదెకరాల పొలం కూడా ఇస్తామని హోంమంత్రి సుచరిత తెలిపారు.

Recommended Video
వాస్తవానికి గుంటూరులో పట్టపగలే నడిరోడ్డుపై జరిగిన రమ్య హత్యపై మహిళా సంఘాలు, విపక్షాలతో పాటు ప్రజా సంఘాల నుంచీ తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. దిశ చట్టం అమల్లోకి రాకపోవడంతో పోలీసులు కూడా ఆ మేరకు వేగంగా చర్యలు కూడా తీసుకోలేని పరిస్దితులు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియని పరిస్దితుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే రమ్య కుటుంబ సభ్యులను రెండు రోజుల క్రితం తన క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకున్న సీఎం జగన్ వారికి పలు హామీలు ఇచ్చి పంపారు. ఇప్పుడు హోంమంత్రి సుచరిత కూడా అవే హామీల్ని తిరిగి వారికి చెప్పడంతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రకటన చేశారు. అయితే ఈ కోర్టు ఎప్పటికల్లా ఏర్పాటవుతుందో మాత్రం ఆమె చెప్పలేదు. దీంతో మహిళలపై గతంలో జరిగిన దాడుల్లా కాకుండా దీనిపై ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications