గవర్నర్ తో జగన్ భేటీ : నోట్ల రద్దు కష్టాలపై జోక్యానికి వినతి
ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో వైఎస్ జగన్ 10 అంశాలు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: ఏపీ విపక్ష నేత, వైయ్యస్సార్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఆయనతోపాటు వైయ్యస్సార్ పార్టీ ఎమ్మేల్యేలు 9 మంది కూడా ఉన్నారు. ఈ భేటీలో వైఎస్ జగన్ 10 అంశాలు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు.
ముఖ్యంగా నోట్ల రద్దు, ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే బ్యాంకుల వద్ద రైతులు, సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై గవర్నర్ నరసింహన్ కు ఒక నివేదికను అందించిన జగన్ పరిస్థితులను చక్కదిద్దడానికి గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు.
బుధవారం గవర్నర్ నరసింహన్ జన్మదినం కావడంతో ఆయనకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపిన జగన్ ఆ తరువాత వివిధ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్ళినట్లు సమాచారం. నోట్ల రద్దుతో వ్యవసాయ ఉత్పత్తి తగ్గుదల, గిట్టుబాటు ధరలపై దీని ప్రభావం తదితర విషయాలను ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళారు.

గవర్నర్ తో భేటీ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ నోట్ల రద్దు విషయం ఏపీ సీఎం చంద్రబాబుకు ముందే తెలుసునని, అందువల్లే ఆయన, ఆయన మద్దతుదారులు ఆ ప్రభావం వారిపై పడకుండా ముందుగానే అన్నీ చక్కబెట్టుకున్నారని అన్నారు. నోట్ల రద్దుపై ప్రధాని మోడీ ప్రకటన చేయడానికి కేవలం రెండ్రోజుల ముందే హెరిటేజ్ ఫుడ్స్ షేర్లను ఫ్యూచర్ గ్రూప్ కు చంద్రబాబు అమ్ముకున్న విషయాన్ని గుర్తుచేశారు.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 15.25 లక్షల కోట్ల విలువ చేసే పాత నోట్లను రద్దు చేయగా.. వాటిలో కేవలం రూ.5.5 లక్షల కోట్ల విలువైన కొత్త నోట్లు మాత్రమే ఆర్బీఐ పంపిణీ చేసిందని, రద్దు చేసిన నోట్ల విలువతో పోల్చితే ఇవి కేవలం ౩౩ శాతమే అని అన్నారు.
ఏపీ జనాభా ప్రకారం రాష్ట్రానికి రూ.24 వేల కోట్ల కొత్త నోట్లు రావాల్సిన అవసరం ఉందని, కానీ ఈ నెల 15 నాటికి కేవలం రూ.14.740 కోట్ల కొత్త నోట్లు మాత్రమే వచ్చాయని జగన్మోహన్ రెడ్డి వివరించారు. నోట్ల రద్దు నేపధ్యంలో ప్రజల కష్టాలను సీఎం చంద్రబాబునాయుడు పట్టించుకోవడం లేదని, దీంతో తాము గవర్నర్ ను కలిసి రాష్ట్ర అవసరాలను అనుగుణంగా కొత్తనోట్లు సరఫరా అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications