ఎమ్మెల్సీ పై దొంగతనం, డెకాయిట్ కేసు పెడతారా - జగన్..!!
మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వ తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ పార్టీ కి చెందిన ఎమ్మెల్సీ పైన కేసు నమోదు చేయటం పైన జగన్ కీలక ప్రశ్నలు సంధించారు. స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దేశం మొత్తం చూస్తుందని... తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బ్యాలెట్ బాక్సులు రోడ్డు మీకు ఎలా వచ్చాయని నిలదీసారు. అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎమర్జెన్సీని తలపించే ఈ పాలన అత్యంత హేయమని జగన్ విమర్శించారు.
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్ పైన మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అక్రమ అరెస్ట్.. నిర్బంధాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో జగన్ చేసిన పోస్టింగ్ లో ప్రభుత్వం పైన మండిపడ్డారు. ట్వీట్ లో .."ఎన్నికల అక్రమాలను ప్రశ్నిస్తూ పార్టీ అభ్యర్థులతో, ప్రజలతో కలిసి శాంతియుతంగా ఆందోళన చేస్తే, దానిపై తప్పుడు కేసులు పెట్టి, అడ్డగోలుగా అరెస్టు చేసి, నిర్బంధానికి గురిచేయడం దుర్మార్గం. ఎమర్జెన్సీని తలపించే ఈ పాలన అత్యంత హేయం. గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంలో గురువారం పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత, నేరుగా నాగార్జున వర్శిటీకి చేరాల్సిన బ్యాలెట్ బాక్సులను మధ్యలో నల్లపాడు వద్ద ఎందుకు దింపారు? ఎవరి ఆదేశాలమేరకు ఆ బ్యాలెట్ బాక్సులను దింపారు? అసలు బ్యాలెట్ బాక్సులకు ఉండాల్సిన భద్రత ఏమైంది?.. అని ప్రశ్నించారు.

ప్రభుత్వ తీరు పై జగన్ ఆగ్రహం
దీనికి కొనసాగింపుగా.." స్ట్రాంగ్ రూంకు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుమీద కనిపిస్తే, కళ్లెదుటే వాటిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మా పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలమీద లాఠీఛార్జి చేస్తారా? తప్పులు మీరుచేసి, ఏకంగా బ్యాలెట్ బాక్సులు మార్చే ప్రయత్నంచేసి, మళ్లీ మావాళ్లపై అక్రమకేసులా? చివరకు ఒక ఎమ్మెల్సీమీద డెకాయిటీ, దొంగతనం కేసులుకూడా పెడతారా? ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఈ స్థానిక ఎన్నికల్లో... నామినేషన్లు రిగ్గింగ్, నామినేషన్ల స్క్రూట్నీ రిగ్గింగ్, పోలింగ్ బూత్‌ల రిగ్గింగ్, పోలింగ్ సైక్లింగ్, పోలింగ్ పర్సంటేజీల రిగ్గింగ్, చివరకు పోలింగ్ ముగిశాక ఇలా బ్యాలెట్ బాక్సులు కూడా రిగ్గింగ్? చంద్రబాబుగారూ ఈ స్థానిక ఎన్నికల్లో మీరు ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తుంటే, ఈ తప్పుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతారా? మీ అధికార, పోలీసు బలాన్ని ప్రయోగించి కట్టడిచేయాలని అనుకున్నంత మాత్రాన, మీరు చేసిన ఎన్నికల అక్రమాలు దాచిపెట్టలేరు. మీ అప్రజాస్వామిక పద్ధతులను దేశమంతా చూస్తూనే ఉంది. ప్రజలు చూస్తూ ఊరుకోరు, ఇలాంటి దుర్మార్గాలను సహించరు, మీకు తగిన బుద్ధిచెప్తారు..." అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.













Click it and Unblock the Notifications
