మాధవ్ సస్పెన్షన్ పై వైసీపీ మల్లగుల్లాలు ? డీజీపీ విచారణకు మహిళా కమిషన్ ఆదేశం-ఫోరెన్సిక్ కీలకం
ఏపీలో నగ్నవీడియోతో దొరికిపోయిన హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం కలకలం రేపుతోంది. మాధవ్ పై చర్యలు కోరుతూ ఇప్పటికే విపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే చర్యలు తప్పవన్నారు. అయినా విమర్శల జడివాన ఆగడం లేదు. దీంతో ఇవాళ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ఈ వ్యవహారంపై చర్యలకు డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు.

గోరంట్ల మాధవ్ ఎపిసోడ్
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారం ఏపీ రాజకీయాల్నికుదిపేస్తోంది. ఈ వీడియో బయటికి రాగానే స్పందించిన మాధవ్.. పొంతన లేకుండా వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం ముదిరింది. ఓ వర్గం మీడియా దీన్ని వివాదాస్పదం చేస్తుందంటూ ఆరోపించినా వెంటనే జనం నమ్మే పరిస్దితి లేకపోవడంతో వైసీపీ అధిష్టానమే స్పందించాల్సి వచ్చింది. దీంతో మాధవ్ పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ పరీక్షల ఫలితాల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

చర్యలు కోరుతూ డీజీపీకి మహిళా కమిషన్ లేఖ
గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించే పరిస్ధితి లేకపోవడంతో మహిళా కమిషన్ సాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మాధవ్ వ్యవహారంపై విచారణ జరిపి, నిజమని తేలితే చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. మహిళా లోకానికి తలవంపులు తెచ్చిన ఈ ఘటనలో నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఆమె కోరారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో మహిళా కమిషన్ ఆదేశాలపై డీజీపీ విచారణ చేపట్టబోతున్నారు.

సస్పెన్షన్ పై జగన్ మల్లగుల్లాలు ?
నగ్న వీడియోలో అడ్డంగా దొరికిన ఎంపీ గోరంట్ల మాధవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా వద్దా అనే విషయంలో సీఎం జగన్ పార్టీలో కీలక నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మాధవ్ ఎపిసోడ్ వాస్తవమా కాదా అనేది నిర్ధారణ చేసుకున్నాక దీనిపై చర్యలు తీసుకుంటే బావుంటుందనే వాదన కూడా కీలక నేతల నుంచి వినిపిస్తోంది. అయితే వాస్తవమని నిర్ధారణ అయితే మాత్రం సస్పెన్షన్ వేటు విధించే అవకాశం ఉంది. పార్టీ నుంచి బహిష్కరించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. అయితే వీటన్నింటికీ ఇప్పుడు ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది.












Click it and Unblock the Notifications