AB Venkateswara Rao: రిటైర్మెంట్ వేళ ఏబీని వదలని జగన్-క్యాట్ తీర్పుపై హైకోర్టులో అప్పీల్..!
ఏపీలో మాజీ నిఘా విభాగాధిపతి, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారం ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఆయనపై సస్పెన్షన్ విధించిన వైసీపీ సర్కార్.. అనంతరం హైకోర్టు ఆదేశాలతో ఎత్తేసినా, తిరిగి ప్రెస్ మీట్ పెట్టారన్న కారణంతో మరోసారి సస్పెండ్ చేసింది. దీన్ని తోసిపుచ్చుతూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్ ) తాజాగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏబీకి ఊరట లభించింది.
అయితే క్యాట్ ఆదేశాల ప్రకారం ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉండగా.. ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు ససేమిరా అంటోంది. అంతే కాదు ఇవాళ క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించింది. ఏబీపై రెండోసారి సస్పెన్షన్ చెల్లదంటూ క్యాట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై త్వరలో విచారణ జరగబోతోంది. అదే సమయంలో మరో నాలుగు రోజుల్లో ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్ కాబోతున్నారు.

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్దంగా సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెన్షన్ చేయడం కుదరదంటూ క్యాట్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం తప్పనిసరిగా ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సిన పరిస్ధితి ఎదురైంది. అయితే సీఎం జగన్ ఏబీ విషయంలో ఏం చేయాలనే దానిపై చర్చలు జరిపారు. చివరికి క్యాట్ తీర్పుపై హైకోర్టుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. దీంతో హైకోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలైంది. దీనిపై ఎల్లుండి విచారణ జరగనుంది.












Click it and Unblock the Notifications