పతాకస్ధాయికి హైకోర్టు ధిక్కారం? ఈ ఏడాది 4వేల కేసులు ! జగన్ సర్కార్ హామీ ఇదే?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలపై దాఖలవుతున్న కేసులపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు కావడం లేదు. దీంతో హైకోర్టు నేరుగా జోక్యం చేసుకుని ధిక్కార కేసులు నమోదు చేయాలని ఆదేశాలు ఇస్తోంది. ఇలా తమ ఆదేశాలు పట్టించుకోని అధికారులపై కేవలం ఈ ఏడాదిలో దాఖలైన ధిక్కార కేసుల సంఖ్య తాజాగా 4 వేలు దాటిపోవడం పట్ల హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

హైకోర్టు ఆదేశాల ధిక్కారం
ఏపీలో హైకోర్టు పలు కేసుల్లో వెలువరిస్తున్న ఆదేశాలను ప్రభుత్వ అధికారులు లెక్క చేయడం లేదు. ఇది ఒకటి రెండు కాదు వేల సందర్భాల్లో జరుగుతోంది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం ఇచ్చే ఆదేశాల్ని తూచా తప్పకుండా పాటించడమో, లేక అభ్యంతరాలు ఉంటే సర్వోన్నత న్యాయస్ధానమైన సుప్రీంకోర్టునో ఆశ్రయించే అవకాశం ఉంటుంది.
కానీ అవేవీ చేయకుండా ఉద్దేశపూర్వకంగానో, నిర్లక్ష్యంగానో హైకోర్టు ఆదేశాలను అధికారులు పక్కనబెట్టేస్తున్నారు. దీంతో ఆ తర్వాత పిటిషనర్లు తిరిగి హైకోర్టును ఆశ్రయించినప్పుడు న్యాయస్ధానం సీరియస్ కావడం, అధికారుల్ని కోర్టుకు పిలిపించడం కూడా సర్వసాధారణంగా మారిపోతోంది.

ఈ ఏడాదిలో 4 వేల ధిక్కార కేసులు
ఈ ఏడాది హైకోర్టు ఆదేశాలను ధిక్కరించిన సందర్భాల్లో నమోదు చేసిన ధిక్కరణ కేసుల సంఖ్య 4 వేలు దాటిపోయింది. ఇవన్నీ గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని అమలు చేయకపోవడం వల్ల అధికారులపై నమోదైన కేసులే. ఈ నాలుగు వేల కేసులపై విచారణ కొనసాగుతోంది. వీటిలో పలు కేసుల్లో అధికారులు ఇప్పటికే హైకోర్టులో నేరుగా హాజరవుతూనే ఉన్నారు. అయినా ఇందులో ఎలాంటి పురోగతి లేదు.
దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఉపాధి హామీ బిల్లుల వ్యవహారంలో హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల్ని నలుగురు ఐఏఎస్ అధికారులు అమలు చేయలేదు. దీనిపై నిన్న కూడా ఈ నలుగురు ఐఏఎస్ లు హైకోర్టుకు హాజరై వివరణ ఇచ్చుకున్నారు. వారిపై మరోసారి సీరియస్ కావడం మినహా హైకోర్టు కూడా చేసేందుకు ఏమీ లేకుండా పోతోంది.

ధిక్కారంపై హైకోర్టు ఆందోళన
రాష్ట్రంలో కేవలం ఈ ఏడాదిలోనే నాలుగు వేల కోర్టు ధిక్కార కేసులు నమోదు కావడం పట్ల హైకోర్టు నిన్న ఆందోళన వ్యక్తం చేసింది. ఉపాధి హామీ బిల్లుల కేసులో హైకోర్టు గతంలో పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా ఇంకా బిల్లుల చెల్లింపు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో నలుగురు ఐఏఎస్ అధికారులు హైకోర్టుకు హాజరయ్యారు. వీరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఈ వ్యవహారంలో వివరణ సంతృప్తి కరంగా లేకపోతే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తప్పవని హెచ్చరించింది. మరో కోర్టు ధిక్కార కేసులో మరికొందరు ఐఏఎస్ ల వివరణతో తదుపరి విచారణకు వారిని హాజరుకాకుండా మినహాయింపు ఇచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు కోర్టు ధిక్కార కేసులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీటి వల్ల కోర్టుకు హాజరయ్యే ఉన్నతాధికారుల సంఖ్య కూడా పెరుగుతుందని పేర్కొంది.

హైకోర్టుకు జగన్ సర్కార్ హామీ?
రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులపై ఈ ఏడాది కోర్టు ధిక్కారం కింద నాలుగు వేలకు పైగా కేసులు నమోదు కావడంపై హైకోర్టు ఆగ్రహంతో ప్రభుత్వం స్పందించింది. ఉన్నత న్యాయస్ధానం ఆదేశాలను అమలు చేయడం ద్వారా వీటి సంఖ్య తగ్గించుకుంటామని హైకోర్టుకు జగన్ సర్కార్ హామీ ఇచ్చింది. ఈ మేరకు ఏజీ శ్రీరామ్ హైకోర్టుకు హామీ ఇచ్చారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం న్యాయశాఖ కార్యదర్శితో పాటు సీఎస్ తో వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారుల భేటీలు నిర్వహిస్తోంది. కోర్టు ధిక్కరణ కేసుల్లో హైకోర్టు ఆదేశాలు అమలు చేయడంతో పాటు తగిన అఫిడవిట్లు దాఖలు చేసి వివరణ ఇవ్వాలని సూచిస్తోంది. అయినా ఇంకా భారీ ఎత్తున ధిక్కార కేసులు మిగిలుండటం విశేషం.












Click it and Unblock the Notifications