జగన్ సర్కార్ మరో ఝలక్- రేషన్ కావాలా ? పెన్షన్ కావాలా ? కార్డుకు ఒకటే పెన్షన్-మినహాయింపులివే
ఏపీలో రేషన్ కావాలంటే ఈ-కేవైసీ చేయించుకోవాల్సిందే అంటూ కరోనాలోనూ లబ్దిదారుల్ని ఆధార్ కేంద్రాల చుట్టూ, సచివాలయాల చుట్టూ తిప్పుతున్న వైసీపీ సర్కార్ ఇప్పుడు తాజాగా మరో షాకి ఇచ్చింది. ఒకే రేషన్ కార్డుపై ఒకటికి మించిన పింఛన్లు ఉంటే వాటిని తొలగించేందుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు లబ్ది దారులకు పలు జిల్లాల్లో నోటీసులు జారీ అవుతున్నాయి. వీటిపై సరైన వివరణ ఇవ్వకుంటే మాత్రం పింఛన్ల కోత తప్పదంటోంది. దీంతో రేషన్ కార్డు దారులతో పాటు పింఛన్ దారులూ బెంబేలెత్తుతున్నారు.

రేషన్ కార్డు దారులకు చుక్కలు
పేదలకు ఇచ్చే రేషన్ కార్డులకు ఈ కేవైసీ చేయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారుల్ని పరుగులు తీయిస్తోంది. రేషన్ కార్డుపై రేషన్ రావాలంటే తప్పనిసరిగా ఈకేవేసీ చేయించాలంటూనే.. దీనికి ఎలాంటి గడువు పెట్టలేదని రోజూ ప్రకటనలు జారీ చేస్తోంది. అసలే కరోనా సమయం, తగినన్ని ఆధార్ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం, సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలకు కేంద్రం ఇంకా అనుమతి ఇవ్వకపోవడంతో రేషన్ కార్డు దారులు పిల్లలతో కలిసి తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఇందులో ఏ తేడా వచ్చినా ఇకపై రేషన్ అందదన్న భయం వారిలో కనిపిస్తోంది.

రేషన్ కార్డు దారులకు మరో షాక్
రేషన్ కార్డుపై రేషన్ రావాలంటే ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేయడంలో మాత్రం విఫలమవుతోంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రేషన్ కార్డు దారులకు జగన్ సర్కార్ తాజాగా మరో షాక్ ఇస్తోంది. రేషన్ కార్డుల్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా పింఛన్లు తీసుకుంటున్న వారిని ఏరిపారేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రేషన్ కార్డుల ఆధారంగా ఇకపై విచ్చలవిడిగా పింఛన్లు తీసుకునేందుకు వీలుండదని భావిస్తున్నారు. అక్రమాల్ని అరికట్టే పేరుతో జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం రేషన్ కార్డు దారులతో పాటు పింఛన్ దారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో కుటుంబంలోని అందరు సభ్యుల పేర్లు ఉంటాయి. కానీ కుటుంబానికి నెలకు ఒక రేషన్ మాత్రమే లభిస్తుంది. కానీ రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్న వారిలో ఒకటి కంటే ఎక్కువ మంది సామాజిక పింఛన్లు తీసుకుంటున్నారు. వీరు వివిధ ప్రాంతాల్లో ఉంటూ అదే రేషన్ కార్డును ఆధారంగా చూపుతూ పెన్షన్లు తీసుకుంటున్నారు. అంటే ఒకే రేషన్ కార్డుపై ఉన్న వారిలో మూడు, నాలుగు పింఛన్లు కూడా ఉండే అవకాశం ఉంది. తద్వారా ఒకే కుటుంబంలో ప్రభుత్వం రెండు, మూడు పింఛన్లు ఇవ్వాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వంపై ఆర్ధికంగా భారం పెరుగుతోంది. పింఛన్ల నిబంధనలు అపహాస్యం పాలవుతున్నాయి. దీంతో ఇకపై ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రేషన్ కావాలా ? పింఛన్ కావాలా
ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న నిబంధన ప్రకారం ఒక రేషన్ కార్డులో ఒకటి కంటే ఎక్కువ పింఛన్లు ఉండేందుకు వీల్లేదు. దీంతో లబ్దిదారులు పింఛన్ కావాలంటే సదరు రేషన్ కార్డుల నుంచి తమ పేరు తొలగించుకోవాలి. లేదంటే రేషన్ కార్డులోనే ఉంటూ పింఛన్ కోల్పోవాల్సి వస్తుంది. అంటే రేషన్, పింఛన్లలో వీరికి ఒకటి మాత్రమే అందుతుంది. అలా కాకుండా రెండూ తీసుకునే వారికి మాత్రం ప్రభుత్వం షాకులిస్తోంది. ఈ విధానం ద్వారా భారీ ఎత్తున పింఛన్ల తొలగింపుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇది అమల్లోకి వస్తే ఫ్రభుత్వానికి భారీగా ఆర్ధిక భారం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.

వీరికి మాత్రం మినహాయింపు
ఒకే రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూ, వారితో పాటు తామూ పెన్షన్ తీసుకుంటున్న లబ్దిదారుల్లో కొందరికి మాత్రం ప్రభుత్వం ఇందులో మినహాయింపు ఇస్తోంది. ఇలా మినహాయింపు ఇస్తున్న వారి జాబితాను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో దివ్యాంగులు, అభయహస్తం లబ్దిదారులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, డీఎంహెచ్వో పింఛన్లకు మాత్రం ఇందులో మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి మినహా మిగిలిన వారికి ఒకే రేషన్ కార్డులో పింఛన్లు ఉంటే మాత్రం కచ్చితంగా తొలగించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

పింఛన్ దారులకు నోటీసులు
ఇలా ఒకే రేషన్ కార్డులో వాస్తవంగా పింఛన్ అందాల్సిన వారితో పాటు పింఛన్ తీసుకుంటున్న అదనపు లబ్దిదారులకు ప్రభుత్వం తాజాగా నోటీసులు పంపుతోంది. ఇప్పటికే నెల్లూరు, కడప, విజయనగరంతో పాటు పలు జిల్లాల్లో ఈ మేరకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. 2019లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మీరు పింఛన్ కు అర్హులు కానందున ఇకపై పింఛన్ ఇవ్వకుండా నిలిపేస్తున్నట్లు అధికారులు నోటీసుల్లో పేర్కొంటున్నారు. దీనిపై అభ్యంతరాలు చెప్పుకునేందుకు వారం రోజుల గడువు ఇస్తున్నట్లు తెలుస్తోంది. సరైన వివరణ రాకపోతే మాత్రం కచ్చితంగా పించన్ల తొలగింపు తప్పదంటున్నారు.
Recommended Video

లబ్దిదారుల్లో ఆందోళనతో గతంలో వెనక్కి
వాస్తవానికి ఒకే రేషన్ కార్డుపై ఒకటికి మించి పింఛన్లు తీసుకుంటున్న కుటుంబాలను గుర్తించి ఏరేవేసేందుకు ప్రభుత్వం గతేడాదే సిద్దమైంది. కరోనా కావడం, పింఛన్ల తొలగింపుపై లబ్దిదారుల్లో ఆందోళన వ్యక్తం కావడంతో ప్రభుత్వం ముందడుగు వేయలేకపోయింది. ఇప్పుడు కరోనా తగ్గడం, పరిస్దితులు కాస్త చక్కబడటంతో ఈ వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. ఇప్పుడు రేషన్ కార్డులు, పింఛన్లు రెండు స్కీమ్ ల భారం అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా దీన్ని తగ్గించుకోవాలని భావిస్తున్న సర్కార్ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో మిగతా జిల్లాల్లోనూ నోటీసులు జారీ చేసి అక్రమ లబ్దిదారుల్ని ఏరివేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.












Click it and Unblock the Notifications