తిరుపతి సభపై ఉత్కంఠ- అమల్లోకి జగన్ సర్కార్ ప్లాన్-కోర్టు అనుమతి దొరక్కుండా
ఏపీలో వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ప్రక్రియకు వ్యతిరేకంగా అమరావతిలోనే రాజధానిని ఉంచాలని కోరుతూ రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ నెల 17న తిరుపతిలో యాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే ప్రభుత్వం ఇందుకు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులోనూ అనుమతి దొరక్కుండా చేసేందుకు వైసీపీ సర్కార్ తెరవెనుక ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

తిరుపతిలో అమరావతి సభ
అమరావతిలోనే రాజధాని ఉంచాలంటూ రైతులు చేపట్టిన పాదయాత్ర తాజాగా కోస్తా జిల్లాలను దాటి రాయలసీమలోకి ప్రవేశించింది. మరో ఆరు రోజుల పాటు ఈ యాత్ర జరగనుంది. ఆ తర్వాత ఈ నెల 17న తిరుపతిలో బహిరంగ ఏర్పాటు చేసేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఈ సభ జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ పెరుగుతోంది. ప్రభుత్వంతో పాటు రాయలసీమలో స్ధానికులు సైతం ఈ పాదయాత్రకు, సభకు వ్యతిరేకంగా ఉండటమే ఇందుకు కారణం. అయితే హైకోర్టు ఇందుకు అనుమతిస్తే మాత్రం తప్పనిసరిగా సభ జరగనుంది.

అనుమతి నిరాకరించిన సర్కార్
తిరుపతిలో అమరావతి రైతుల బహిరంగసభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఇప్పటికే పోలీసు అధికారుల్ని ఆశ్రయించి అమరావతి రైతులకు ఈ మేరకు వారు క్లారిటీ ఇచ్చేశారు. దీంతో అమరావతి రైతులు నిర్వహించే బహిరంగ సభ జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ మొదలైంది. అదే సమయంలో ఎలాగైనా సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న రైతులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా వారు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై త్వరలో విచారణ జరగబోతోంది.

హైకోర్టు నిర్ణయమే ఫైనల్
అమరావతి రైతులు తిరుపతిలో నిర్వహించే బహిరంగసభకు వివిధ కారణాలతో ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో వారు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో పాదయాత్రకు హైకోర్టు నుంచే అనుమతి తెచ్చుకున్న రైతులు.. ఇప్పుడు బహిరంగ సభకూ అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై త్వరలో హైకోర్టు విచారణ చేపట్టబోతోంది. దీంతో రైతులతో పాటు ప్రభుత్వం కూడా తమ వాదనలు సిద్ధం చేసుకుంటున్నారు. కోవిడ్ నిబంధనల పేరుతో సభకు అనుమతి నిరాకరిస్తున్న పోలీసులు హైకోర్టులో ఏం చెప్తారన్న దానిపైనే బహిరంగసభకు అనుమతి ఆధారపడి ఉంది.

జగన్ సర్కార్ వ్యూహమిదే ?
గతంలో న్యాయస్ధానం టూ దేవస్ధానం పేరుతో పాదయాత్ర చేపట్టేందుకు ప్రభుత్వాన్ని అమరావతి రైతులు అనుమతి కోరారు. దీంతో ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అప్పుడు హైకోర్టును ఆశ్రయించిన రైతులు షరతులతో కూడిన అనుమతి తెచ్చుకున్నారు. ఇప్పుడు మరోసారి తిరుపతిలో బహిరంగసభకు సైతం ప్రభుత్వం అనుమతివ్వకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈసారి హైకోర్టులో ఎలాగైనా అనుమతి రాకుండా చూసేందుకు అక్కడ జనాన్ని స్ధానిక వైసీపీ నేతలు రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలతోనే వీరు అమరావతి రైతులు తిరుపతిలో సభ పెట్టేందుకు వీల్లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాయలసీమపై అమరావతి యుద్ధం పేరుతో దీన్ని అడ్డుకునేందుకు స్ధానిక వైసీపీ నేతల్ని రెచ్చగొడుతున్నట్లు సమాచారం. అయితే అంతిమంగా హైకోర్టు అనుమతిస్తే ఈ వ్యూహాలన్నీ చిత్తు కావడం ఖాయమేనని అమరావతి రైతులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications