ఏపీలో అటకెక్కిన మద్యనిషేధం ? మూడేళ్లకు బార్లపాలసీ విడుదల-కీలక అంశాలివే..
ఏపీలో మద్యనిషేధానికి తూట్లు పొడుస్తున్నారన్న విపక్షాల విమర్శల్ని నిజం చేస్తూ ప్రభుత్వం ఇవాళ బార్ల పాలసీని విడుదల చేసింది. అదీ వచ్చే మూడేళ్ల కాలానికి ఈ విధానం అమల్లో ఉంటుంది. ఇప్పటికే మద్యంపై ఆదాయాన్ని చూపుతూ భారీ ఎత్తున అప్పులు తెస్తున్న ప్రభుత్వం ఇక తాము ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన కీలక హామీని అటకెక్కించడం ఖాయమని తేలిపోయింది. ప్రభుత్వం ఇవాళ ప్రకటించిన బార్ల విధానంలో కీలక అంశాలున్నాయి.

ఏపీలో కొత్త బార్ల విధానం
ఏపీలో కొత్త బార్ల విధానాన్ని అమల్లోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల కాలానికి వర్తించేలా ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ కొత్త బార్ల విధానం అమల్లోకి రానుంది. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం అప్పటివరకూ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే బార్లకు ఇచ్చిన లైసెన్స్ లను ఆగస్టు వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం మరో నిర్ణయం ప్రకటించింది. దీంతో సాంకేతిక ఇబ్బందులు రాకుండా ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

బార్ల విధానం ఇలా..
తాజాగా ప్రభుత్వం ప్రకటించిన మద్యం విధానం ప్రకారం మొత్తం 840 బార్లకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని మొత్తం మూడు కేటగిరీలుగా విభజించారు. ఇందులో 50 వేల జనాభా ఉన్న ప్రాంతాలకు ఓ విధంగా, 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాలకు మరో రకంగా, 5 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాలకు ఇంకో విధంగా ఫీజులు నిర్దారిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా ఫీజులు చెల్లించి బార్ల లైసెన్స్ లు పొందే అవకాశం కల్పించారు. ఆగస్టులో ఈ లైసెన్స్ ల జారీ ప్రక్రియ ప్రారంభిస్తారని తెలుస్తోంది.

అటకెక్కుతున్న మద్యనిషేధం?
ప్రభుత్వం ఇప్పటికే మద్యం ద్వారా వచ్చే ఆదాయన్ని చుపుతూ భారీ ఎత్తున అప్పులు తీసుకొస్తోంది. తాజాగా మరో రూ.25వేల కోట్ల అప్పులు ఈ ఆదాయాన్ని చూపి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు బార్లను సైతం వచ్చే మూడేళ్లకు లైసెన్స్ లు ఇచ్చేలా కొత్త విధానం ప్రకటించడంతో ఇక మద్యనిషేధం అటకెక్కినట్లే కనిపిస్తోంది.
వాస్తవానికి 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం జగన్ ఇచ్చిన కీలక హామీల్లో మద్యనిషేధం కూడా ఒకటి. అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్షిక మద్యనిషేధం అమలు చేస్తున్న జగన్.. ఈ మధ్య దానికి కూడా మంగళం పాడేలా పలు నిర్ణయాల్ని ప్రకటిస్తున్నారు. దీంతో విపక్షాలు సైతం మాటతప్పారంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నాయి.












Click it and Unblock the Notifications