KR Suryanarayana : ఉద్యోగ నేత కేఆర్ సూర్యనారాయణకు జగన్ భారీ షాక్- సస్పెన్షన్ వేటు..!
ఏపీలో ఉద్యోగుల సమస్యలపై గతంలో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసి వార్తల్లోకి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణపై జగన్ సర్కార్ కన్నెర్ర చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వానికీ, ఆయనకూ మధ్య సాగుతున్న పోరు తాజాగా మరో మలుపు తిరిగింది. వాణిజ్య పన్నుల శాఖలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ఆయన అవినీతి,అక్రమాలకు పాల్పడ్డారంటూ ఇప్పటికే కేసు నమోదు చేసిన ప్రభుత్వం.. తాజాగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.
కేఆర్ సూర్యనారాయణపై పూర్తి స్ధాయిలో క్రమశిక్షణ చర్యలు తీసుకునే వరకూ సస్పన్షన్ వేటు కొనసాగుతుందని ప్రభుత్వం ఈ నెల 21న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్న కేఆర్ సూర్యనారాయణతో కలిసి ఇతర నిందితులు భారీ మొత్తంలో వ్యాపారులు నుంచి తనిఖీల పేరుతో డబ్బులు వసూలు చేశారని ప్రభుత్వం సస్పెన్షన్ ఉత్తర్వుల్లో తెలిపింది. సూర్యనారాయణ ఉద్యోగంలో కొనసాగితే విచారణ సజావుగా సాగదని, అలాగే ప్రభుత్వానికి కూడా హాని కలిగే అవకాశం ఉందంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే విచారణకు సహకరించకపోవడంతో ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది.

ఈ ఏడాది మే 30వ తేదీన విజయవాడ పటమట పోలీస్ స్టేషన్‌లో రిజిస్టర్ అయిన వాణిజ్య పన్నుల శాఖ అక్రమాల కేసులో సూర్యనారాయణ ఏ5 నిందితుడిగా ఉన్నారు. 2019 నుంచి 2021 మధ్య కేఆర్ సూర్యనారాయణ, మెహర్ కుమార్, సంథ్య, వెంకట చలపతి, సత్యనారాయణల అనే ఉద్యోగులతో కలిసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ఆరోపణలు ఉన్నాయి. సూర్యనారాయణ మినహా మిగిలిన నలుగురిని కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఇందులో వారు సూర్యనారాయణతో కలిసి చేసిన కుట్ర వివరాలు వెల్లడించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
సూర్యనారాయణపై పలు సెక్షన్ల కింద నమోదైన కేసులు,ఆరోపణలు, దర్యాప్తుకు సహకరించని తీరు.. ఇలా పలు అంశాల్ని ప్రస్తావిస్తూ ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో సస్పెన్షన్ లో ఉన్న కాలంలో జిల్లా కేంద్రం విడిచి వెళ్లొద్దని ఆయనకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం నమోదు చేసిన కేసులపై సూర్యనారాయణ కోర్టుల్లో పోరాటం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications