Pawan Kalyan : పవన్ వారాహి యాత్రకు జగన్ సర్కార్ ముందస్తు షాక్ లు ?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోతున్న వారాహి యాత్రకు ప్రభుత్వం ముందస్తు షాకులిస్తోంది. ఈ నెల 14న కాకినాడ జిల్లాలో ప్రారంభమయ్యే ఈ యాత్ర అనంతరం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మీదుగా సాగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలో చంద్రబాబు, లోకేష్ యాత్రల సందర్భంగా విధించిన తరహా ఆంక్షలు విధించేందుకు సిద్దమవుతోంది. దీంతో పవన్ యాత్ర ఎలా సాగుతుందో అన్న టెన్షన్ నెలకొంది.
కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వారాహి యాత్ర చేపట్టేందుకు పవన్ కళ్యాణ్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే విజయవాడ చేరుకున్న పవన్.. ఇవాళ కనకదుర్గమ్మ ఆలయంలో మరోసారి పూజలు నిర్వహించబోతున్నారు. అనంతరం రేపు మంగళగిరిలోన పార్టీ కార్యాలయంలో యాగం నిర్వహించి ఎల్లుండి అన్నవరం వెళతారు. అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత వారాహి యాత్ర ప్రారంభం కానుంది.

పవన్ కళ్యాణ్ వారాహి యాత్రల షెడ్యూల్ ను జనసేన పార్టీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఎల్లుండి అన్నవరంలో పూజల తర్వాత పవన్ కళ్యాణ్ కత్తిపూడిలో సభ నిర్వహిస్తారు. అక్కడి నుంచి బయలుదేరే వారాహి యాత్ర పలు నియోజకవర్గాల మీదుగా సాగనుంది. మధ్యలో సభలు నిర్వహిస్తారు. జూన్ 16న పిఠాపురంలో వారాహి యాత్ర సభ ఉంటుంది. ఆ తర్వాత 18న కాకినాడలో, 20న ముమ్మడివరంలో, 21న అమలాపురంలో , 22న పి.గన్నవరంలోని మలికిపురంలో, 23న భీమవరం జిల్లా నరసాపురంలో పవన్ సభలు నిర్వహిస్తారు.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా పవన్ యాత్ర సాగే కాకినాడ, బీఆర్ అంబేద్కర్ జిల్లాల్లో శనివారం నుంచే పోలీసు యాక్ట్ 30 అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అనుమతి లేకుండా ఆందోళనలు, బహిరంగసభలు నిర్వహించడం, సౌండ్ సిస్టమ్స్ వాడకం నిషేధం. అయితే పవన్ యాత్రలో భాగంగా బహిరంగసభలు, సౌండ్ సిస్టమ్స్ వాడకం ఉండే అవకాశం ఉండటంతో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది.












Click it and Unblock the Notifications