జగన్‌పై పార్టీ నేతల అసంతృప్తి..అదే తప్పు చేస్తున్నారా..?
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల ఏకంగా 164 సీట్లలో కూటమి నేతలు విజయం సాధించారు. గత ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ ఎన్నికల్లో కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ప్రతిపక్ష హోదా కూడా సాధించలేని వైసీపీ ప్రేక్షక పాత్రకే పరిమితం అయింది. ఓటమిపై స్పందించిన జగన్..ఈ తీర్పు ఊహించలేదని మళ్లీ ప్రజల్లోకి వెళ్తామని ప్రజా సమస్యలపై పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే ఇంత దారుణ ఓటమి తర్వాత కూడా జగన్‌లో ఎటువంటి మార్పు కనిపించడం లేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో కనిపిస్తోంది.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందడానికి గల కారణాలను తెలుసుకునేందుకు నేతలతో జగన్ సమీక్షలు నిర్వహించారు.మొదటి రోజు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో రెండో రోజు రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఓటమికి గల కారణాలను నేతలను అడిగి తెలుసుకున్నారు.

అయితే నేతల అభిప్రాయాలకంటే పార్టీ ఓటమికి గల కారణాలను జగనే వారికి వివరించారట. జగన్ తాను తెప్పించుకున్న నివేదికలనే నాయకులకు వివరిస్తూ, నాయకులు చెప్పిన మాటలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదట.క్షేత్రస్థాయిలో ఫీడ్ బ్యాక్ ఏంటనేది స్థానిక నాయకులకు ఒక అవగాహన ఉంటుంది. కానీ జగన్ మాత్రం మనం ఓడిపోలేదు మోసపోయం అనే ధోరణిలో మాట్లాడినట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను జగన్ అంచనా వేయలేకపోవడం , ఐ ప్యాక్ టీం అందించిన రిపోర్టులపైనే ఆధారపడటం వల్లే జగన్‌కు ఈ దారుణ ఓటమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో జనాల అభిప్రాయం ఏ విధంగా ఉంది , నాయకుల ఫీడ్ బ్యాక్ ఏమిటనేది విశ్లేషించుకుని ముందుకు వెళ్తే ఈ తరహా ఫలితాలు వచ్చి ఉండేవి కావనే అభిప్రాయం వ్యక్తం అవతుంది.
ఇప్పటికే పార్టీ క్యాడర్ జగన్ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వాలంటీర్ వవస్థ కారణంగా స్థానిక నాయకత్వాన్ని నిర్వీర్యం చేశారని, పార్టీ అధికారంలో ఉన్న సమయంలో క్యాడర్‌ను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లారని , ఇప్పటికైనా ఆ పద్ధతిని మార్చుకుని క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా నాయకులకు పూర్తి స్వేచ్ఛతో కూడిన బాధ్యతలు అప్పగిస్తేనే పార్టీ పరిస్థితి మెరుగవుతుందనే అభిప్రాయాలు పార్టీ నాయకులు నుంచి వ్యక్తం అవుతున్నాయి. మరి నాయకుల సూచనలను జగన్ పాటిస్తారో లేక తన పంథాలోనే ముందుకు సాగుతారో చూడాలి.












Click it and Unblock the Notifications