కొత్త జిల్లాలపై జగన్ వ్యూహమిదే-కేంద్రం, బీజేపీ మద్దతుతోనే-నియోజకవర్గాల పునర్విభన జరిగినా !
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు వైసీపీ సర్కార్ తెరదీసింది. ఇప్పటికే దీనిపై నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు ఉగాదిలోపు కొత్త జిల్లాల్ని అందుబాటులోకి తెస్తామని కూడా చెబుతోంది. ఇందుకు అనుగుణంలో అదికార గణం పావులు కదుపుతోంది. అయితే 2026లో జరిగే ఎంపీ సీట్ల పునర్విభజనతో ప్రస్తుతం ఎంపీ సీట్ల ప్రకారం చేస్తున్న ఈ జిల్లాల విభజన ఇబ్బందుల పాలవుతుందనే అంచనాలూ ఉన్నాయి. అయితే తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే అలాంటి సమస్యలేవీ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

కొత్త జిల్లాల ప్రక్రియ
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. త్వరలో కొత్త జిల్లాల్ని అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ఓవైపు అధికారులతో ఏర్పాట్లు చేయిస్తూనే మరోవైపు ఈ నిర్ణయాన్ని సమర్ధించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని చోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా స్ధూలంగా చూస్తే కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించినట్లే కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం కూడా సంతోషంగానే ఉంది. ఎలాంటి వివాదాలు లేకుండా ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేసేందుకు పావులు కదుపుతోంది.

కొత్త జిల్లాలకు విపక్షాల మద్దతు
వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న జిల్లాల విభజన ప్రక్రియకు విపక్షాల నుంచి కూడా అభ్యంతరాలు లేపు. ప్రధాన విపక్షం టీడీపీ అయితే దీనిపై మౌనంగా ఉండిపోతోంది. అలాగే మపరో విపక్షం బీజేపీ అయితే జిల్లాల విభజన తమ నిర్ణయమే అంటోంది. బీజేపీలో ఉన్న ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి అయితే తండ్రి పేరును కృష్ణాజిల్లాకు పెట్టడాన్ని కూడా స్వాగతించారు. మిగతా పార్టీలు మాత్రం మౌనంగా ఉన్నాయి. అంతిమంగా చూస్తే విపక్ష పార్టీలు కూడా జగన్ నిర్ణయాన్ని ఆమోదించినట్లే అని చెప్పుకోవచ్చు. విధానాలు, సిద్దాంతాల పరంగా జగన్ ను విభేదిస్తున్న వారంతా జిల్లాల విభజన విషయంలో మాత్రం వ్యతిరేకించేందుకు ఇష్టపడటం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రజల స్పందన కూడా ఇంకా బయటికి రాకపోవడమే.

బీజేపీ, కేంద్రం మద్దతుతోనే
ముఖ్యంగా ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స్వాగతిస్తోంది. చిన్న రాష్ట్రాల సిద్ధాంతానికి ఎప్పుడూ మద్దతిచ్చే బీజేపీ.. ఈసారి ఏపీలో చిన్న జిల్లాలకు కూడా తమ ప్రణాళికలో భాగంగానే మద్దతిస్తోంది. చిన్న చిన్న భూభాగాలను అయితే సులువుగా తమ రాజకీయం నడిపించొచ్చన్న బీజేపీ సిద్ధాంతాల్లో ఇది కూడా భాగమే. అయితే బీజేపీ, కేంద్రం స్పందన మాత్రం ఏపీ సీఎం జగన్ కు కలిసివస్తోంది. దీంతో ఆయన వీరిద్దరి మద్దతునే దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

జగన్ లెక్క ఇదేనా ?
2026లో నియోజకవర్గాల పునర్విభజన ఉండగా..నాలుగేళ్లు ముందుగా ఇప్పుడు జిల్లాల విభజన ఎందుకనే ప్రశ్నలు అక్కడక్కడా తలెత్తుతున్నాయి. అయితే జగన్ మాత్రం పక్కా లెక్కలతోనే ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినా అందుకు అనుగుణంగా ఉండేలా జిల్లాల విభజన చేపట్టినట్లు అర్ధమవుతోంది. రెవెన్యూ డివిజన్ల మార్పులతో పాటు ఇతర చర్యలు కూడా అందులో భాగమనే ప్రచారం జరుగుతోంది. అన్నింటికంటే మించి కేంద్రంతో సత్సంబంధాల నేపథ్యంలో భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగినా ఆ ప్రభావం ఈ జిల్లాల విభజనపై ఉండకుండా జగన్ చూసుకున్నారని తెలుస్తోంది. కేంద్రం, బీజేపీ మద్దతు ఉండటంతో ఆ మేరకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఈ రెండు ప్రక్రియలు సాగేలా జగన్ స్కెచ్ వేశారన్న ప్రచారం జరుగుతోంది.