నీట్ పరీక్షా విధానం మారాల్సిందే! తెరపైకి కొత్త ప్రతిపాదనలు!!
నీట్-యూజీ 2026 పేపర్ లీక్ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్ననేపథ్యంలో పరీక్షా విధానంలో సమూల మార్పులు చేయాలని విద్యావేత్తలు, వైద్య నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రీకృత పరీక్షా విధానం వల్ల ఒకచోట పేపర్ లీక్ అయినా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని మెడికల్ సీట్లను నీట్ పరిధి నుంచి మినహాయించాలని, పరీక్షను కంప్యూటరైజ్ట్ విధానంలో నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి వస్తున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వ కోటాలోని యూజీ, పీజీ సీట్లకు నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని 'డాక్టర్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ ఈక్వాలిటీ' ప్రధాన కార్యదర్శి జీఆర్ రవీంద్రనాథ్ కోరారు. దీనివల్ల ఏకకాలంలో లక్షలాది మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సిన ఒత్తిడి తగ్గుతుందని.. అక్రమాలకు తావుండదని ఆయన పేర్కొన్నారు. అలాగే రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, ప్రశ్నాపత్రాల నిర్వహణలో మానవ ప్రమేయం తగ్గించి టెక్నాలజీని వాడాలని సూచించారు.

ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. అన్ని కోచింగ్ సెంటర్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకునేలా నిబంధనలు తీసుకురావాలని, ఫీజులను నియంత్రించాలని కోరారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వమే ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో కూడిన కోచింగ్ సెంటర్లను ప్రారంభించాలని అసోసియేషన్ ప్రతిపాదించింది. పరీక్షా ప్రక్రియ పారదర్శకంగా, సురక్షితంగా ఉన్నప్పుడే కష్టపడి చదివే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని నియో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ ఆదిత్య కేల్కర్ అభిప్రాయపడ్డారు.
ఐఎంఏ మాజీ ప్రతినిధి రాజీవ్ జయదేవన్ మాట్లాడుతూ.. పేపర్ లీకేజీలను అరికట్టడానికి డిజిటల్ పరీక్షలే సరైన మార్గమని చెప్పారు. ప్రశ్నాపత్రాలను ఎన్‌క్రిప్టెడ్ రూపంలో ఉంచి, పరీక్ష సమయానికి మాత్రమే ఓపెన్ అయ్యేలా టెక్నాలజీని వాడాలని సూచించారు. అలాగే మల్టీ-సెషన్ టెస్టింగ్ (వివిధ విడతల్లో పరీక్ష) నిర్వహించడం ద్వారా రిస్క్ తగ్గుతుందని.. 'నార్మలైజేషన్' పద్ధతి ద్వారా విద్యార్థుల మెరిట్‌ను నిష్పక్షపాతంగా అంచనా వేయవచ్చని ఆయన వివరించారు. ఈ సంస్కరణలు చేపడితేనే జాతీయ స్థాయి పరీక్షలపై విద్యార్థులకు నమ్మకం కలుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications