జగన్ వర్సస్ పవన్ : ఇక తేల్చుకోవాల్సింది బీజేపీ - టీడీపీకి ఛాన్స్ ఇస్తారా : ఓట్ల చీలిక..!!
ఏపీలో రాజకీయంగా ఏం జరగబోతోంది. పార్టీల కొత్త ఎత్తులు..వ్యూహాలు ఎటు టర్న్ తీసుకుంటాయి. తాజాగా జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మరింత ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఈ సభలో పవన్ కళ్యాన్ రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించటమే లక్ష్యంగా పని చేస్తామని ప్రకటించారు. ఇందు కోసం రాష్ట్రం కోసం పనిచేసే పార్టీలతో ఒకటవుతామని స్పష్టం చేసారు. పార్టీల పేర్లు ప్రస్తావించక పోయినా..తన ఉద్దేశం ఏంటనేది చెప్పకనే చెప్పారు.

బీజేపీకి పవన్ క్లారిటీ ఇచ్చినట్లేనా
ఇదే సమయంలో బీజేపీతో సడన్ గా తెగ తెంపులు అని చెప్పకుండా.. వారు చెప్పినట్లుగా వైసీపీ పైన రూట్ మ్యాప్ వెంటనే వెల్లడించాలని..అందుకోసమే వెయిట్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కొత్త పాత్తులు ఉంటాయని తేల్చి చెప్పారు. అయితే, పవన్ చెబుతున్నట్లుగా ఏపీ రాజకీయాలు అంత క్లియర్ గా లేవు.
పవన్ కు బీజేపీ ఇస్తామని చెప్పిన విధంగా వైసీపీని కట్టడి చేసే ప్లాన్ ఇచ్చినా...పవన్ కేవలం బీజేపీనే నమ్ముతారా అంటే అది ఆయన మాటల్లోనే అనేక సందేహాలు కనిపించాయి. పవన్ పరోక్షంగా ప్రతిపక్షాలు అన్నీ కలిసి కట్టుగా వైసీపీని ఓడించేందుకు ముందుకు రావాలని..అందిరనీ కలిపే బాధ్యత తాను తీసుకుంటాననే సంకేతాలు ఇచ్చారు. కానీ, బీజేపీ - ఇప్పుడు పవన్ మనసులో మాట అర్దం అయిన తరువాత ఏ రకంగా వ్యవహరిస్తుందనేది కీలక అంశం గా మారుతోంది.

టీడీపీతో కలవటానికి బీజేపీ సిద్దమేనా
పవన్ కోరుకుంటున్నట్లుగా అందరూ కలిసి కట్టుగా..వైసీపీకి వ్యతిరేకంగా ఒకే జట్టు కట్టి.. ఓట్ల చీలక నివారించటం సాధ్యమయ్యే పనిగా కనిపించటం లేదు. తిరిగి 2014 ఎన్నికల సమయంలో టీడీపీ -బీజేపీ - జనసేన కలిసి పోటీ చేసే అంశం పైనే క్లారిటీ రావాల్సి ఉంది. టీడీపీతో జత కట్టటానికి బీజేపి ఇప్పటికైతే సిద్దంగా లేదని ఢిల్లీ సమాచారం.
2019 ఎన్నికల ముందు బీజేపీతో టీడీపీ విభేదించిన తరువాత చంద్రబాబు నేరుగా ప్రధాని మోదీ పైన చేసిన వ్యాఖ్యలు... ప్రధాని రాష్ట్ర పర్యటన సమయంలో నల్ల బెలూన్లతో నిరసనలు.. జాతీయ స్థాయిలో మోదీని ఓడించటం కోసం కాంగ్రెస్ తో జత కట్టటం.. నేరుగా ఢిల్లీలో రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లి మంతనాలు.. రాహుల్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం ..ఇవన్నీ ఇప్పుడు బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే, జగన్ ను ఎదుర్కోవాలంటే టీడీపీ లేకుండా పవన్ కేవలం బీజేపీతో పొత్తుతో సాధ్యం కాదనే విశ్లేషణలు ఉన్నాయి.

పవన్ మధ్యవర్తిత్వం సఫలమవుతుందా
టీడీపీతో పొత్తు కావాలని పవన్ కోరుకుంటే బీజేపీ కలిసి వస్తుందా అంటే అదీ డౌటే. ఇక, అన్ని పక్షాలు ఒకే వేదిక పైకి రావటం సాధ్యమయ్యే పని కాదు. కాంగ్రెస్.. వామపక్షాలు బీజేపీకి వ్యతిరేకం. అదే సమయంలో బీజేపీతో టీడీపీ జత కడితే వామపక్షాలు దూరం అవుతాయి. బీజేపీ టీడీపీతో నో అంటే పవన్ దూరం అయ్యే అవకాశం ఉంది.
దంతో.. ఇప్పుడు జగన్..పవన్ ఇద్దరిలో ఎవరికి ప్రత్యక్షంగా - పరోక్షంగా మద్దతు ఇవ్వాలో తేల్చాల్సింది బీజేపీ పార్టీ. అయితే, టీడీపీ - జనసేన పొత్తుకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ మాత్రం తాము ఎవరితో పొత్తు కట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. గతంలోనూ ఇదే విధానం..భవిష్యత్ లోనూ ఇదే కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

టార్గెట్ జగన్.. మారుతున్న సమీకరణాలు
ఇక, ఇదే సమయంలో కాపు నేతల వరుస సమావేశాలు.. అటు ముద్రగడ మంతనాలు..ఇటు, బ్రదర్ అనిల్ తెర చాటు వ్యూహాలు..ఇవన్నీ ఎటువంటి సమీకరణాలకు కారణమవుతాయనేది స్పష్టత రావాల్సి ఉంది. రానున్న ఎన్నికల వేళ..ఇన్ని పార్టీలు - ఇన్ని సంఘాలు ..టార్గెట్ జగన్ లక్ష్యంగా వేస్తున్న అడుగులతో..వ్యతిరేక ఓటు చీలకుండా నియంత్రించటం పవన్ చెప్పినంత సులువుగా కనిపించటం లేదు.
అదే సమయంలో వీరందరినీ ఒకే వేదిక మీదకు తేవటం..సీట్ల సర్దుబాటు సాధ్యపడే అంశం కాదు. ఇక, ప్రధానంగా బీజేపీ రానున్న రోజుల్లో టీడీపీతో వైఖరి ఏంటనేది తేలితేనే..రాష్ట్రంలో 2024 పొత్తుల పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీజేపీ తిరిగి టీడీపీతో జత కట్టటానికి ముందకొస్తే తిరిగి 2014 ఎన్నికల పొత్తులే రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. బీజేపీ అందుకు నో అంటే..సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. దీంతో..ఇప్పుడు బీజేపీ జనసేన అధినేత పవన్ కు ఏం స్పష్టత ఇవ్వనుందీ...టీడీపీ విషయంలో ఏం క్లారిటీ ఇవ్వనుందీ అనే అంశాలు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications