నేడే జగనన్న విద్యాదీవెన: భీమవరంలో బటన్ నొక్కి జమ చెయ్యనున్న సీఎం జగన్!!
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు పశ్చిమగోదావరి జిల్లా లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో నివాసం నుంచి హెలికాప్టర్లో ఉదయం 10 గంటలకు బయలుదేరి 10 గంటల 40 నిమిషాలకు భీమవరం చేరుకుంటారు.
అక్కడనుండి బైపాస్ రోడ్ మీదుగా మూడు కిలోమీటర్లు రోడ్ షో లో పాల్గొని 11 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకొని జగనన్న విద్యా దీవెన పధకానికి సంబంధించి బటన్ నొక్కి విద్యార్థుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఒంటి గంట నలభై నిమిషాలకి హెలికాప్టర్లో బయలుదేరి తిరిగి తాడేపల్లి వెళ్తారు.

ఈ రోజు సీఎం జగన్ జగనన్న విద్యా దీవెన పథకంలో ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి 2023- 24 విద్యా సంవత్సరంలో జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన అర్హులైన 8 లక్షల 9 వేల 39 మంది విద్యార్థులకు 584 కోట్ల రూపాయలు నేడు బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు. దీనికోసం పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో ఏర్పాట్లు చేశారు.
ఏర్పాట్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గురువారం రాత్రి పరిశీలించారు. జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా ఫీజు రియింబర్స్మెంట్ విషయాల్లో ప్రభుత్వం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు చెల్లిస్తోంది. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదువుకోవాలని సమున్నతమైన లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకంలో క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ జగన్ సర్కార్ విద్యార్థులకు అండగా నిలుస్తోంది.
జులై-సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి 8,09,039మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ రూ.584కోట్లను నేడు పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో లో బటన్ నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేరుగా జమ చేయనున్నారు. జగనన్న విద్యా దీవెన క్రింద నేడు అందిస్తున్న రూ. 584కోట్లతో కలిపి ఇప్పటివరకు విద్యాదీవెన, వసతిదీవెనల క్రింద జగనన్న ప్రభుత్వం చేసిన, చేస్తున్న వ్యయం మొత్తంగా రూ. 18,576కోట్లు.
ఇది గత ప్రభుత్వం చేసిన వ్యయం కంటే రూ. 6,435 కోట్లు అధికం. ఈ క్రమంలో నేడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించే సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ జగనన్న విద్యా దీవెన పథకంలో ఫీజు రియంబర్స్మెంట్ ను అందించడమే కాకుండా, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications