యాక్టివ్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి జైపాల్ రెడ్డి?
హైదరాబాద్: తెలంగాణ విషయంలో కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి అత్యంత చురుగ్గా కదులుతున్నారు. కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కావడానికి ఆయన ఉవ్విళ్లూరుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మొదటి నుంచి తెలంగాణ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వచ్చిన జైపాల్ రెడ్డి తెలంగాణకు అనుకూలంగా జులై 30వ తేదీన కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) నిర్ణయం తీసుకున్న తర్వాత చురుకైన పాత్రకు ముందుకు వచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి తనకు పోటీ రాబోమని జైపాల్ రెడ్డి ఇతర నాయకులతో హామీ కూడా తీసుకున్నట్లు చెబుతున్నారు. జిల్లాల పర్యటనలకు దూరంగా ఉంటూ వచ్చిన జైపాల్ రెడ్డి ఇప్పుడు జిల్లాల్లో పర్యటించడానికి ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెసు నాయకులకు ఆయన పెద్ద దిక్కుగా మారారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాకు కృతజ్ఞతలు తెలిపే వరంగల్ జైత్రయాత్ర సభలో ఆయన పాల్గొన్నారు.

దానికితోడు, తెలంగాణ కాంగ్రెసు నేతలు ఢిల్లీలో క్రమం తప్పకుండా ఆయన నివాసంలోనే సమావేశమవుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన చురుకైన పాత్ర నిర్వహించడానికి ఏకాభిప్రాయం అవసరమనేది కూడా ఆయన గుర్తించారు. ఈ విషయంపై ఆయన ఇదివరకే తనకు విధేయులై, ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్న డి. శ్రీనివాస్‌తోనూ కె. జానారెడ్డితోనూ మాట్లాడినట్లు చెబుతున్నారు.
అయితే, కులప్రాతిపదికపై తీసుకుంటే ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్నారు. కానీ, జైపాల్ రెడ్డి ముందుకు వస్తే వారు కూడా వెనక్కి తగ్గే అవకాశాలు లేకపోలేదనే మాట వినిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెసు నాయకులు విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా వచ్చే ఎన్నికల్లో పనిచేయడానికి జైపాల్ రెడ్డి తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయితే ఉపయోగం ఉంటుందనే భావన కూడా ఉంది.
జైపాల్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం, కాకపోవడమనేది సీమాంధ్ర ముఖ్యమంత్రి మీద కూడా ఆధారపడి ఉంటుందని అంటున్నారు. సీమాంధ్ర రాష్ట్రానికి రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే జైపాల్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు సన్నగిల్లవచ్చునని చెబుతున్నారు. దీంతో సీమాంధ్ర ముఖ్యమంత్రి పదవికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి కన్నా లక్ష్మినారాయణ పేర్లను జైపాల్ రెడ్డి ముందుకు తెస్తున్నట్లు సమాచారం.
గతంలో రోశయ్య స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం జైపాల్ రెడ్డికి వచ్చింది. సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు కూడా ఆయనను ప్రోత్సహించారు. అయితే, జైపాల్ రెడ్డి తెలంగాణవాదం దృష్ట్యా అందుకు సిద్ధపడలేదు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి 2010లో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.












Click it and Unblock the Notifications