టిపై స్పీడ్: హైద్రాబాద్‌పైనే బిజెపిVsసీమాంధ్ర మంత్రులు

శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు జరిగే కేంద్ర మంత్రివర్గ ప్రత్యేక సమావేశంలో బిల్లుపై ఆమోద ముద్ర పడుతుందని తెలుస్తోంది. తుది బిల్లులో చేర్చాల్సిన సవరణలపై 'కేంద్ర ప్రభుత్వం - ప్రధాన ప్రతిపక్షమైన బిజెపి - సీమాంధ్ర కేంద్ర మంత్రుల' మధ్య కీలకమైన చర్చల ప్రక్రియ జోరుగా సాగుతోంది. బిజెపి డిమాండ్ చేస్తున్నదీ, సీమాంధ్ర కేంద్ర మంత్రులు కోరుతున్నదీ దాదాపు ఒక్కటే కావడంతో కాంగ్రెస్ పని సులువైనట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్‌ను తాత్కాలికంగానైనా కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర నేతలు పట్టుబడుతున్నారు. ఇందుకు బిజెపి ససేమిరా అంటోంది.
ఈ ఒక్క విషయంలోనే పేచీ పడినట్లు చెబుతున్నారు. మిగిలిన సవరణలపై కేంద్ర జివోఎం ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. గురువారం జివోఎం సభ్యులు సమావేశమై సీమాంధ్ర మంత్రులు, బిజెపి సమర్పించిన సవరణ ప్రతిపాదనలపై చర్చలు జరిపారు. ఈ భేటీలో సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, జైరాం రమేశ్, గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, నారాయణ స్వామి దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు.
విభజనకు ససేమిరా అంటున్న ఇతర నేతలను వదిలిపెట్టి, తమకు సహకరిస్తున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులతోనే జివోఎం సభ్యులు మంతనాలు జరుపుతూ, పరిస్థితిని దారికి తెచ్చే ప్రయత్నం చేశారు. జివోఎం సమావేశం ముగిసిన అనంతరం షిండే, జైరాం రమేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని, ప్రధాని మన్మోహన్‌తోనూ భేటీ అయ్యారు. తాము తీసుకున్న చర్యలను వివరించి, వారి సూచనలు తీసుకున్నారు.
మరోవైపు వెంకయ్య నాయుడు తమ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చలు జరిపారు. ఆ తర్వాత వెంకయ్య నివాసానికి జైరాం వచ్చారు. బిజెపి డిమాండ్లు, వైఖరిని అడిగారు. మౌలికంగా పది జిల్లాల తెలంగాణ విషయంలో ప్రభుత్వానికీ, తమకూ మధ్య ఎలాంటి వైరుధ్యంలేదని వెంకయ్య తెలిపారు. బిల్లులో సవరణలు, ఇతరత్రా అంశాలపై సుమారు రెండు గంటలపాటు వీరి మధ్య చర్చ జరిగింది. సవరణల ప్రతిపాదనలపై స్పష్టత ఏర్పడితే శుక్రవారమే కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా భేటీ అయి విభజన బిల్లుపై ఆమోద ముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం తర్వాత ఏ రోజైనా పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టవచ్చని హోంశాఖ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications