ప్రభుత్వంపై మరో పోరాటానికి పవన్ సిద్దం - నేడు స్వయంగా..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వం లక్ష్యంగా మరో పోరాటానికి సిద్దమయ్యారు. ఈ రోజు మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం గ్రామంలో పర్యటించనున్నారు. ఆ గ్రామంలో రోడ్ల విస్తరణ కోసం ఇళ్ల కూల్చివేత వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గ్రామంలో 120 అడుగుల రోడ్డు విస్తరణ కోసం గతంలోనే నోటీసులు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. ఇదే గ్రామంలో గతంలో జనసేన ప్లీనరీకి స్థానికులు భూములు ఇచ్చారు. ఆ తరువాత ఆ గ్రామానికి పవన్ కళ్యాణ్ 50 లక్షలు విరాళం ప్రకటించారు. ఆ మొత్తంతో అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ను నిర్మించుకున్నారు.
ఇప్పుడు అక్కడ ఇళ్ల కూల్చివేత వ్యవహారం పైన స్థానికులు హైకోర్టుకు వెళ్లగా, కోర్టు స్టే ఇచ్చింది. ఇళ్ల కూల్చివేత పైన పవన్ కళ్యాణ్ స్పందించారు. కూల్చివేతలతో పాలన ప్రారంభించిన వైసీపీ ప్రభుత్వం త్వరలోనూ కూలిపోతుందని హెచ్చరించారు. వైసీపీ ఓట్లు వేసిన వారికే తాము పాలకులం అన్నట్లుగా పాలన చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఆవిర్భావ సభకు స్థలాలు ఇచ్చినందుకే కక్ష కట్టిందని ఆరోపించారు. ఈ రోజు గ్రామంలో పర్యటించి, వారికి మద్దతుగా నిలవనున్నారు. ఇదే సమయంలో ఈ వివాదం పైన స్థానిక అధికారులు వివరణ ఇచ్చారు.

ఆక్రమణదారులకు అనేక సార్లు నోటీసులు ఇచ్చామని చెప్పుకొచ్చారు. అక్రమణల తొలగింపు ప్రక్రియలో నివాస గృహాలు ఏవీ కూల్చలేదని తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ యు.శారదాదేవి చెప్పారు. ఆక్రమణలకు గురైన భూమిలో నిర్మించిన కట్టడాలను తొలగించాలని ఆక్రమణదారులకు ఈ ఏడాది ఏప్రిల్ నుండి అనేకసార్లు తెలియజేసినట్లు వివరించారు. తొలగించబడిన నిర్మాణాలు ప్రధానంగా కాంపౌండ్ గోడలు మరియు వారి ఇళ్ల ముందు రహదారిపై ఆక్రమణదారులు చేసిన వాణిజ్య నిర్మాణాలని వివరించారు.
ఏప్రిల్‌లో మొదటి వార్నింగ్, షోకాజ్ నోటీసు జారీ చేసిన తర్వాత, ఆక్రమణదారులను 2022 మే నెలలో మరోసారి హెచ్చరించినట్లు కమిషనర్ తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రతిపక్షాలు ఉద్దేశ పూర్వకంగా ఆరోపణలు చేస్తున్నాయని ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆర్కే ఒత్తిడి మేరకే ఇదంతా జరుగుతోందని స్థానిక జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటనతో..ఎటువంటి కార్యాచరణ ప్రకటించబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications