గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చెక్..ఇక శేష జీవితమేనా?
Rajahmundry Rural: రాజమండ్రి రూరల్. తెలుగుదేశం పార్టీకి కంచుకోట. నియోజకవర్గంగా ఆవిర్భవించిన తరువాత టీడీపీ ఒక్కసారి కూడా ఓడి పోని స్థానం ఇది. ఇప్పటివరకు మూడు ఎన్నికలను ఎదుర్కొనగా.. వాటన్నింట్లోనూ పసుపు జెండానే ఎగిరింది. ఇక ముందు కూడా అదే పరిస్థితి ఉండొచ్చు.
2009, 2014, 2019 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టింది టీడీపీ. 2009లో చందన రమేష్, ఆ తరువాతి ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. 2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని సైతం తట్టుకుని టీడీపీ కైవసం చేసుకున్న నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి.

ఈ స్థానం టీడీపీ చేజారడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీతో ఉన్న పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ స్థానంపై జనసేన పార్టీ కర్చీఫ్ వేసింది. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కందుల దుర్గేష్.. ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖరారైంది. ఈ మేరకు ఆయన పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిసేపటి కిందటే ఖరారు చేశారు.
ఈ ఉదయం ఆయన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయకులతో సమావేశం అయ్యారు. రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. స్థానిక రాజకీయాల గురించి ఆరా తీశారు. రూరల్‌కు దుర్గేష్ పేరును ఖరారు చేశారు.

కందుల దుర్గేష్ సొంత నియోజకవర్గం ఇదే. 2019 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేశారాయన. 42 వేలకు పైగా ఓట్లను సాధించారు. 22 శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయి. పొత్తులో భాగంగా ఇప్పుడిదే స్థానం నుంచి కందుల దుర్గేష్ పోటీ చేయబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ నియోజకవర్గానికి టీడీపీ తరఫున ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిస్థితేటమిటనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. రెండు సార్లు ఇక్కడి నుంచి గెలిచిన గోరంట్ల బుచ్చయ్యకు సీటును ఎలా సర్దుబాటు చేస్తారు? అదీ లేకపోతే ఆయనను ఎలా బుజ్జగిస్తారనేది ఉత్కంఠతగా మారింది. కందుల దుర్గేష్ విజయానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహకరిస్తారా? లేదా? అనేదీ చర్చనీయాంశమౌతోంది.












Click it and Unblock the Notifications