ఏపీ సచివాలయంలో పవన్ సన్నిహితురాలు కోట రుక్మిణి- అనూహ్యం
Pawan Kalyan Kota Rukmini: జనసేన పార్టీ నాయకురాలు కోట రుక్మిణి ఏపీ సచివాలయంలో కనిపించారు. పార్టీ అధినాయకుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితురాలనే గుర్తింపు ఉంది ఆమెకు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షత ఒకవంక మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలోనే ఆమె సచివాలయంలో కనిపించడం అందరినీ ఆకర్షించింది.
ఈ మంత్రివర్గ సమావేశానికి పవన్ కల్యాణ్ సహా మంత్రులందరూ హాజరయ్యారు. సచివాలయంలో అడుగుపెట్టిన వెంటనే ఆమె అక్కడి సిబ్బంది సహకారంతో నేరుగా మంత్రివర్గ సమావేశం జరిగే సచివాలయం మొదటి అంతస్తులోని సమావేశ మందిరం వైపు వెళ్లారు. ఆ సమయంలో ఒకరిద్దరు సిబ్బంది ఆమె వెంట కనిపించారు.

కోట రుక్మిణి సచివాలయానికి రావడం ఇదే తొలిసారి. ఆమెను పోలీసులు తొలుత గుర్తు పట్టలేదు. ఆమెను అడ్డుకున్నారు. లోనికి వెళ్లడానికి అనుమతి లేదని తెలియజేశారు. ఆ సమయంలో ఆమె ఎవరికో ఫోన్ చేశారు. కొద్దిసేపటికి పవన్ కళ్యాణ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఛాంబర్ నుంచి ఆదేశాలు రావడంతో అనుమతించారు.
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కోట రుక్మిణి పేరు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. పార్టీలో ఆమె పెత్తనం పెరిగిపోయిందంటూ గతంలో పసుపులేటి పద్మావతి సైతం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రుక్మిణి తనను ఎలా ఇబ్బందులకు గురి చేశారనే విషయంపై 140 పేజీల లేఖ రాశారు అప్పట్లో.
కృష్ణా జిల్లాకు చెందిన కోట రుక్మిణి ఇదివరకు లండన్‌లో నివసించే వారు. అక్కడ ఆమెకు ఓ టాప్ బ్రాండెడ్ షాప్ ఉండేదని జనసేన కార్యకర్తలు గతంలోనే వెల్లడించారు. రాజకీయాల పట్ల ఆకర్షితులైన తరువాత జనసేనలో చేరారు. ఆ పార్టీ సెంట్రల్ అఫైర్స్ కమిటీ వైస్ ఛైర్మన్‌గా అపాయింట్ అయ్యారు. ఇప్పుడు ఆమె హఠాత్తుగా సచివాలయంలో కనిపించడం కనుబొమలెగరేసేలా చేసింది.












Click it and Unblock the Notifications