Pawan Kalyan: త్రిశంకు స్వర్గంలా విశాఖ: ఉత్తరాంధ్ర, సీమవాసులూ స్వాగతించట్లేదు: పవన్ కల్యాణ్
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ అమరావతి ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలకు దిగిన రైతులు, తమ పార్టీ నాయకులను అరెస్టు చేయడాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తప్పు పట్టారు. రాజధాని రైతులు ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగా నిరసన తెలియ చేస్తుంటే ప్రభుత్వం వారిని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

రైతులు, మహిళలను భయ పెట్టేలా..
గుంటూరు జిల్లా చినకాకాని వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తోన్న రైతులు, మహిళల పట్ల పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారని అన్నారు. వారిని భయపెట్టి నిరసన నుంచి దూరం చేయడానికి ప్రయత్నించారని విమర్శించారు. తమ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస యాదవ్ ను గృహ నిర్బంధంలో ఉంచారని, పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాస్‌ను అకారణంగా అరెస్టు చేశారని అన్నారు.
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు..
ఇలాంటి చర్యలతో రైతుల ఆందోళనలను ఆపగలమని ప్రభుత్వం భావిస్తే అది పొరపాటే అవుతుందని పవన్ కల్యాణ్ హితవు పలికారు. అమరావతి నుంచి రాజదానిని తరలించి భూములు త్యాగం చేసిన రైతులకు అన్యాయం చేయడానికి ప్రభుత్వం సంకల్పించిందని, దీన్ని అడ్డుకుని తీరుతామని అన్నారు. అమరావతి రైతుల త్యాగాన్ని వృధా కానివ్వబోమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు.

విశాఖవాసులు సంతోషంగా లేరు..
విశాఖపట్నం వాసులు కూడా పరిపాలన రాజధాని విషయంలో సంతృప్తిగా కనిపించట్లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తీవ్ర వెనకబాటుతనం ఉందని, వలసలు అధికంగా ఉన్నాయని అన్నారు. ఆ జిల్లాల అభివృద్ధిపై ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని మండిపడ్డారు. విశాఖలో రాజధానిని ఏర్పాటు చేయడం వల్ల రాయలసీమవాసులకీ దూరం అవుతుందని అన్నారు. సీమవాసుల నుంచి వ్యక్తమౌతోన్న వ్యతిరేకత పట్ల ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని చెప్పారు.

ఉద్యోగులకు అనేక ఇబ్బందులు..
రాజధాని మార్పు అనేది ఉద్యోగులకు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తోందని పవన్ కల్యాణ్ చెప్పారు. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వెళ్లిన ఉద్యోగులు తమ పిల్లలను విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో చదివిస్తున్నారని, ఇప్పుడిప్పుడే వారి కుటుంబాలు కుదురుకొంటున్నాయని చెప్పారు. మళ్ళీ విశాఖకు పంపిస్తే వారి కుటుంబాలుకి ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనవుతాయని చెప్పారు.

త్రిశంకు స్వర్గంలా విశాఖ..
అన్ని ప్రాంతాలకు ఇది త్రిశంకు రాజధానిగా మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం ఎవరికీ సంతృప్తి కలిగించట్లేదని, భూములను త్యాగం చేసిన ప్రాంతంలోనే రాజధానిని కొనసాగించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు రాజధాని ప్రాంతంలో చేసిన మహా పాదయాత్ర వారి ఆవేదనకు అద్దంపట్టిందని చెప్పారు. రాజధాని అమరావతి ప్రాంతాన్ని ప్రభుత్వం మరో నందిగ్రామ్‌లా మార్చివేసిందని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications