ఏపీలో నెంబర్ వన్ స్థానం లో పిఠాపురం
అసెంబ్లీ ఎన్నికల సమరభేరి మోగడంతోపాటు మే 13వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ నాలుగోతేదీన ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఏ పార్టీకా పార్టీ తన అస్త్ర శస్త్రాలను బయటకు తీస్తోంది. ప్రధాన పార్టీలైన వైసీపీ, తెలుగుదేశం కన్నా ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనే రాష్ట్ర ప్రజల దృష్టి ఎక్కువగా ఉంది. తాను వెలవడంకన్నా పవన్ కల్యాణ్ ను ఓడించడమే ధ్యేయంగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. పిఠాపురం ఎన్నికను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
పిఠాపురం వచ్చిన పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ నేత వర్మ తల్లిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. తర్వాత కుక్కుటేశ్వరస్వామి, అమ్మవారి శక్తిపీఠాన్ని, దత్తాత్రేయుణ్ని దర్శించుకున్నారు. తర్వాత శ్రీపాద శ్రీవల్ల క్షేత్రాన్ని దర్శించుకొని పూజలు చేశారు. పవన్ కల్యాణ్ సామాజికవర్గానికి చెందిన ప్రజలు పిఠాపురం నియోజకవర్గ పరిధిలో దాదాపు 91వేలమంది ఉన్నారు. దీంతో ఆయన గెలుపు నల్లేరుపై నడక అని భావిస్తున్నారు.

పిఠాపురం పేరు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చను రేకెత్తిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో రోజూ ట్రెండింగ్ లోనే నిలుస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన మీడియాతోపాటు యూట్యూబ్ ఛానెళ్లతో సహా అన్ని మీడియా సంస్థలు పిఠాపురంపై వాలిపోయాయి. పవన్ కల్యాణ్ మీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు.. మీరు ఓటేస్తున్నారా? ఆయన్ను గెలిపించాలనుకుంటున్నా? అనే ప్రశ్నలతో అక్కడి ప్రజలను హోరెత్తిస్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ పోటీచేస్తుండటంవల్ల ఈ నియోజకవర్గానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేదానికన్నా పిఠాపురం నుంచి పోటీచేస్తున్న పవన్ కల్యాణ్ గెలుస్తాడా? లేదా? అనే ఉత్కంఠే అందరిలో నెలకొందంటే ఇక్కడి రాజకీయ వాతావరణం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గెలుపును పవన్ కల్యాణ్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి వార్డుకు సీనియర్ రాజకీయనేతలను నియమించారు. వారి కనుసన్నల్లో, వారి సలహాలు, సూచనలతో పవన్ ప్రచారం నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications