పవన్ కళ్యాణ్ ధర్మయాగం మొదలు-ఎల్లుండి వారాహి యాత్ర నేపథ్యంలో..
ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్దమవుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఎల్లుండి నుంచి వారాహి యాత్ర మొదలుపెట్టబోతున్నారు. కాకినాడ జిల్లా అన్నవరం నుంచి ప్రారంభమయ్యే తొలి విడత వారాహి యాత్ర భీమవరం వరకూ సాగనుంది. ఈ నేపథ్యంలో యాత్రకు ముందు గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ధర్మయాగం చేపట్టారు. రెండు రోజుల పాటు సాగే ఈ యాగాన్ని పవన్ స్వయంగా ప్రారంభించారు.
ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మంగళగిరిలో యాగం ప్రారంభించారు. ఈ యాగాన్ని పవన్ స్వయంగా గణపతి పూజతో అంకురార్పణ చేశారు. ఇవాళ ఉదయం 6గం.55 నిమిషాలకు పవన్ కళ్యాణ్ సంప్రదాయబద్ధంగా పట్టువస్త్ర ధారణలో యాగశాలకు వచ్చి దీక్ష చేపట్టారు. ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో విలసిల్లాలనే ఆకాంక్షతో దేవతామూర్తులకు ప్రణతులు అర్పించారు.

యాగశాలలో మొత్తం అయిదుగురు దేవతామూర్తులను ప్రతిష్టాపించారు. స్థిరత్వం, స్థితప్రజ్ఞత ప్రసాదిత దేవత గణపతి, శత్రు, శత్రుత్వ నిరోధిత దేవత చండీ మాత, అష్టైశ్వర్య ప్రసాదాధిపతులు శివపార్వతులు, ఆయురారోగ్య ప్రదాత సూర్య భగవానుడు, ధార్మిక సమతుల్యత, త్రిస్థితియుక్త కారకుడు శ్రీ మహావిష్ణువు ఈ యాగపీఠంపై పరివేష్టితులై ఉన్నారు. ఈ ఐదు దేవతా మూర్తులకు అభిముఖంగా యంత్ర స్థాపన చేపట్టారు. విగ్రహం, యంత్రం, హోమం ఆలంబనగా ఇవాళ ఉదయం ప్రారంభమైన ఈ యాగం రేపు కూడా కొనసాగుతుంది.

మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలోని విశాల ప్రాంగణంలో రూపుదిద్దుకున్న యాగశాల ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోందని జనసేన పార్టీ తెలిపింది. సనాతన ధర్మం పరిఢవిల్లుతోందని, యాగ సంప్రదాయ మేళవింపులో భాగంగా మామిడి తోరణాలు, పూలహారాలు, అరటిచెట్లు, రంగవల్లుల అలంకరణతో యాగశాల శోభాయమానంగా అలరారుతోందని వెల్లడించింది.

ఈ యాగం చేపట్టేందుకు ఆదివారం సాయంత్రానికే పవన్ కళ్యాణ్ యాగశాలకు చేరుకున్నారు. ఎటువంటి హడావిడి, ఆర్భాటం లేకుండా కేవలం రుత్వికులు మాత్రమే సంప్రదాయబద్దంగా నిర్వర్తిస్తున్న ఈ యాగం ధార్మిక చింతనను కలిగిస్తోందని పేర్కొంది.












Click it and Unblock the Notifications