BRSకు పవన్ కల్యాణ్ దూరమా? దగ్గరా?
జనసేనాని పవన్ కల్యాణ్ పరిస్థితి అడకత్తెరలో ఇరుక్కుపోతున్న పోకచెక్కలా అవుతోంది. తెలంగాణలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలోను, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేరోజు ఆయన నేరుగా తెలంగాణ రాష్ట్ర సమితికే మద్దతిచ్చారు. పి.వి.నరసింహారావు కుమార్తెను పోటీకి దింపడంవల్ల మద్దతిచ్చారనుకున్నా తరుచుగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పవన్ కల్యాణ్ కొనియాడుతుంటారు. పవన్ సినిమాలకు సంబంధించి జరిగే వేడుకలకు ఐటీ మంత్రి కేటీఆర్ తరుచుగా హాజరవుతుంటారు.

బీఆర్ఎస్ పేరుతో ఏపీలోకి కేసీఆర్?
మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి పేరుతో ఏపీలోకి అడుగుపెట్టాలనుకుంటున్నారు. జాతీయ పార్టీగా ఆయనకు నాలుగు రాష్ట్రాల్లో ఆరుశాతం ఓట్లు రాబట్టుకోవడానికి కీలకమైన రాష్ట్రంగా ఏపీ నిలవబోతోంది. ఈ క్రమంలో జనసేన, బీఆర్ఎస్ పార్టీల వైఖరి ఎలా ఉండబోతోందనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తరుచుగా తమ ప్రభుత్వాన్ని కొనియాడే పవన్ కల్యాణ్ పైకానీ, జనసేనపై కానీ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఇంతవరకు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

బీఆర్ఎస్ పై పవన్ వైఖరి?
ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ పార్టీతో పవన్ కల్యాణ్ ఎటువంటి వైఖరిని అవలంబించబోతున్నారు? ఆయన మద్దతు కేసీఆర్ తీసుకుంటారా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఏపీలో పవన్ భారతీయ జనతాపార్టీతో పొత్తు కొనసాగిస్తున్నారు. అధికారికంగా ఈ రెండు పార్టీల మధ్య పొత్తుందికానీ ఎవరికి వారుగా కార్యక్రమాలు చేపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేన వెళ్లడం దాదాపుగా ఖరారైందని వార్తలు వస్తున్నాయి.

టీడీపీతో వెళితే కేసీఆర్ తో కుదరదు!
కేసీఆర్ మాత్రం బీజేపీకి వ్యతిరేకంగానే పార్టీని స్థాపిస్తున్నామని ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా టీడీపీతో వెళ్లే ఆలోచనలో పవన్ ఉన్నారు. ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిందని, ఎన్నికల సమయంలో బహిర్గతం చేస్తారని వార్తలు వస్తున్నాయి. బీజేపీ కూడా కలిసివస్తే ఒక కూటమిగా వెళ్దామనే యోచనలో చంద్రబాబు, పవన్ ఉన్నప్పటికీ ఒంటరిగా పోటీచేయడానికే కేంద్రం మొగ్గుచూపుతోంది. మరోవైపు చంద్రబాబుకు, కేసీఆర్ కు మధ్య పూడ్చలేనంత అగాథం ఉంది. టీడీపీతో పొత్తు నేపథ్యంలో బీఆర్ ఎస్ తో అడుగులు వేసే పరిస్థితి పవన్ కు ఉత్పన్నమవదు. కేసీఆర్ విషయంలో పవన్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతున్నారనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.












Click it and Unblock the Notifications