TDP కంచుకోటలో 2 సీట్లు అడుగుతున్న జనసేన?
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పొత్తుతో బరిలోకి దిగడం ఖాయమంటూ విస్త్రతంగా ప్రచారం జరుగుతోంది. పొత్తులపై త్వరలోనే స్పష్టత ఇస్తామంటూ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మరోవైపు ప్రధానమంత్రిని కలిసిన తర్వాత కూడా జనసేనాని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని, అందరినీ కలుపుకొని వెళతానంటుండటంతో రాజకీయ వర్గాలు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమంటున్నాయి.

40 కోసం పట్టుబడుతున్న జనసేన
పొత్తు కుదిరితే 40 సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టబోతున్నట్లు జనసేన వర్గాల నుంచి సమాచారం అందుతోంది. పొత్తులపై అధికారికంగా ప్రకటన రాలేదు.. అధినేతలు స్పందించలేదు.. కానీ స్థానాలపై ఇరుపార్టీల్లోను చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు 25 నుంచి 30 వరకు కేటాయించే అవకాశం ఉందని చెబుతుండగా, జనసేన వర్గాలు 40 సీట్లు అని చెబుతున్నాయి.

బలమున్నచోట అడగాలనుకుంటోంది..
తాను బలంగా ఉన్న చోట్ల, గత ఎన్నికల్లో భారీగా ఓట్లు నమోదైన నియోజకవర్గాల్లోనే ఈ సీట్లు అడగాలని జనసేన భావిస్తోంది. అందులో భాగంగా విజయవాడ నగరంలో రెండు నియోజకవర్గాలను టీడీపీ నుంచి కోరబోతోంది. విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్ పేరుతో మూడు నియోజకవర్గాలున్నాయి. తూర్పు నుంచి గద్దే రామ్మోహన్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గంతోపాటు పశ్చిమ నియోజకవర్గాన్ని కేటాయించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.

తూర్పు, పశ్చిమ కావాలంటున్న జనసేన?
గద్దే రామ్మోహన్ గతంలో స్వతంత్ర అభ్యర్థిగా గన్నవరం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. దీంతో రామ్మోహన్ ను టీడీపీ అక్కడికి పంపిస్తే వైసీపీలో ఉన్న యలమంచిలి రవికి జనసేన ఆహ్వానం పలికి సీటు కేటాయించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జనసేన తరఫున యువ నాయకుడు పోతిన మహేష్ పశ్చిమ నియోజకవర్గంలో కీలకమైన నేతగా ఉన్నారు. ఈ నియోజకవర్గాన్ని కూడా జనసేన కోరుతోంది. తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తే పోతిన మహేష్ అభ్యర్థి అవుతారు. విజయవాడ నగరంలో కీలకమైన రెండు స్థానాలను కేటాయించడానికి తెలుగు తమ్ముళ్లు అంగీకరిస్తారా? లేదా? అన్నది చూడాలి.












Click it and Unblock the Notifications