కూటమికి అక్కడ గ్లాసు దెబ్బ ఖాయమైందా ? తేల్చేసిన ఈసీ..!
ఏపీలో జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తును ఆ పార్టీ పోటీ చేయని స్ధానాల్లో ఇతరులకు కేటాయించవద్దంటూ కూటమి పార్టీలు చేసిన విజ్ఞప్తిపై చుక్కెదురైంది. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు జనసేన పోటీ చేసే ఎంపీ సీట్ల పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే స్వతంత్రులకు, ఇతరులకు గ్లాసు గుర్తు ఇవ్వబోమని ఈసీ ఇవాళ తేల్చిచెప్పేసింది. పోలింగ్ కు 10 రోజుల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఇప్పుడు గుర్తుల మార్పులు చేయలేమని ప్రకటించింది.
జనసేన పోటీ చేసే నియోజకవర్గాలతో పాటు పోటీ చేయని సీట్లలో కూడా ఇండిపెండెంట్లకు ఇతర పార్టీల అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ పై ఈసీ తమ అభిప్రాయం చెప్పేసింది. ఇవాళ జరిగిన విచారణలో జనసేన పోటీ చేయని లోక్ సభ సీట్ల పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇతరులకు గాజు గ్లాస్ గుర్తు ఇవ్వడాన్ని ఈసీ సమర్ధించుకుంది. అంతే కాదు ఇలా అభ్యంతరాలు తీసుకుంటూనే ఉంటే ఎన్నికల వరకూ వస్తాయని తెలిపింది.

ఈసీ నిర్ణయం ప్రభావం జనసేన పోటీ చేయకుండా కూటమిలో ఇతర పార్టీలు ఎంపీలుగా పోటీ చేస్తున్న సీట్ల పరిధిలో ఉన్న అసెంబ్లీ స్ధానాల్లో పడబోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఇలాంటి దాదాపు 38 సీట్లలో స్వతంత్రులు, చిన్న పార్టీలకు గాజు గ్లాసు గుర్తును ఈసీ కేటాయించింది. ఇప్పుడు ఆయా సీట్లలో కూటమిలో జనసేన కాకుండా ఇతర పార్టీల అభ్యర్ధులు పోటీ చేస్తున్న నేపథ్యంలో వారి ఓట్లపై ప్రభావం చూపబోతోంది.












Click it and Unblock the Notifications