చెవిరెడ్డికి బాలినేని ఛాలెంజ్-నిరూపిస్తే ఆత్మహత్మ-జగన్ ఒక్కరేనా ?
ఏపీలో ఒకప్పుడు వైసీపీలో కలిసి పనిచేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. ముఖ్యంగా సోలార్ స్కాంలో అదానీ నుంచి జగన్ లంచాలు తీసుకున్నారంటూ ఆరోపణలు వస్తున్న వేళ బాలినేనిని టార్గెట్ చేస్తూ చెవిరెడ్డి చేసిన ఆరోపణలు మంటపుట్టించాయి. వీటిపై బాలినేని ఇవాళ ఘాటుగా స్పందించారు.
అదానీ ఒప్పందాల్లో జగన్ రూ.1750 కోట్లు లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయని, అప్పట్లో విద్యుత్ మంత్రిగా ఉన్నాను కాబట్టి దీనిపై వివరణ ఇచ్చానని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. అంతే తప్ప సెకీతో కుదుర్చుకున్న ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. దీనిపై చెవిరెడ్డి చేసిన ఆరోపణల్ని ప్రస్తావిస్తూ వాటిని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ బాలినేని సవాల్ విసిరారు.

నీలాగా నేను ఎవరి మెప్పు కోసమో పని చేయలేదంటూ చెవిరెడ్డిని ఉద్దేశించి బాలినేని వ్యాఖ్యానించారు. ఏ రోజూ జగన్ కాళ్ళ మీద పడి భజన చేయలేదన్నారు. అలా చేయలేదు కాబట్టే ఈరోజు వేరే పార్టీకి వచ్చానని గుర్తుచేశారు. నువ్వు చంద్రబాబును తిడతావ్ కాబట్టే నీకు టికెట్ ఇచ్చారంటూ చెవిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ఎవరి మెప్పు కోసమో మాట్లాడాల్సిన అవసరం తనకు
లేదని, వైఎస్సార్ కుటుంబం అంటే జగన్ ఒక్కరేనా అని బాలినేని ప్రశ్నించారు. విజయమ్మ, షర్మిల వైఎస్ కుటుంబం కాదా అని ప్రశ్నించారు. వారిపై అసభ్యకర పోస్ట్‌లు పెడితే పట్టించుకోరా అని బాలినేని శ్రీనివాసరెడ్డి నిలదీశారు.












Click it and Unblock the Notifications