ఆళ్లగడ్డ టీడీపీ సభకు జనసేన దూరం, ఎందుకంటే?
అమరావతి: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రేపు (మంగళవారం) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గననున్న బహిరంగ సభకు జనసేన దూరంగా ఉండనుంది. ఈ మేరకు ఆళ్లగడ్డ జనసేన పార్టీ సోమవారం ప్రకటన విడుదల చేసింది. మంగళవారం నాటి టీడీపీ సభకు జన సైనికులు, జనసేన నాయకులు వెళ్లకూడదని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.
టికెట్ ఎవరికనేది తేల్చకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కాగా, ఆళ్లగడ్డ టీడీపీ ఇంఛార్జీగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కొనసాగుతున్నారు. మరోవైపు, జనసేన నేతలు వేదికపై రాకూడదని అఖిలప్రియ ఆంక్షలు విధించారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, టీడీపీ నేతల సూచనతో చంద్రబాబు సభకు వెళ్లకూడదని ఏవీ సుబ్బారెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు బ్రేక్‌ఫాస్ట్ ఆహ్వానం
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. మంగళవారం (జనవరి 9న) కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఏపీకి రానున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఎన్నికల బృందానికి ఇద్దరు నేతలూ ఫిర్యాదు చేయనున్నారు.
ఈ క్రమంలోనే ఈసీ బృందాన్ని కలవడానికి ముందే పవన్ కళ్యాణ్.. ఉండవల్లిలోని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చే అల్పాహార విందుకు హాజరవుతారు. తాజా రాజకీయ పరిస్థితి, సీట్ల సర్దుబాటు లాంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం వెంకటగిరిలో నిర్వహించాల్సిన 'రా.. కదిలిరా..' కార్యక్రమాన్ని వాయిదా వేశారు. మధ్యాహ్నం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో బహిరంగ సభ యథాతథంగా జరగనుంది.
ఇటీవల చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై కీలకంగా చర్చించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో అమలు చేయాల్సిన వ్యూహాలపై మంతనాలు జరిపారు.
కాగా, సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధతపై మరోమారు ఆంధ్రప్రదేశ్ అధికారులతో ఈసీ బృందం సమావేశం కానుంది. జనవరి 9, 10 తేదీల్లో సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ ఏపీకి రానున్నారు. మంగళవారంనాడు రాజకీయ పార్టీలు కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ బృందం భేటీ కానుంది. బుధవారం సీఎస్, డీజీపీ సహా వివిధ శాఖల అధికారులతో సమావేశం అనంతరం ఈసీ అధికారులు మీడియాతో మాట్లాడనున్నారు.












Click it and Unblock the Notifications